విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఓ అందమైన అనుభూతి కలిగించేలా సముద్రపు అలలపై తేలియాడే ఓ బ్రిడ్జిని నిర్మించి జగన్ సర్కారు ఫిబ్రవరి 25న ప్రారంభించింది. కానీ, ఆ మరుసటి రోజే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ముందురోజే అట్టహాసంగా ప్రారంభించారు. ఒక్కరోజుకే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇలా తెగిపోవడంపై జగన్ సర్కారు పని తీరు మళ్లీ వివాదాస్పదం అయింది. ఆ బ్రిడ్జి టీ ఆకారంలో ఉండగా.. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది. దాదాప 200 మీటర్లు వెళ్లినట్లు అంచనా. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ట్రయల్ రన్ లో భాగంగా వంతెనను విడదీసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని సందర్శనకు అనుమతిస్తామని చెబుతున్నారు.
విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్ కింద ఈ ప్రాజెక్టును నిర్మించారు. కోటి రూపాయల అంచనా వేస్తే.. పనులు పూర్తయ్యేసరికి రూ.1.6 కోట్లు ఖర్చు అయ్యింది. తీరా చూస్తే ఒకరోజుకే బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాజాగా కొత్త వాదన తెరపైకి వచ్చింది. బ్రిడ్జి తెగిపోవడంతో ప్రభుత్వానికి వస్తున్న చెడ్డపేరు అంతా ఇంతా కాదు. వారు మాక్ డ్రిల్ అంటూ ఎంతగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. జగన్ సర్కారు డొల్లతనానికి నిదర్శనంగా ఈ ఘటనను పేర్కొంటున్నారు.
సరిగ్గా ఈ ఘటన ఎన్నికలకు ముందు జరగడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఇంకో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలు ఇంకో నెలన్నరలో జరుగుతాయి. సరిగ్గా ఇదే సమయంలో బ్రిడ్జి తెగిపోయింది. ఇదే విశాఖలో గతంలో జగనన్న నిర్మించిన మోడల్ బస్ స్టాపులు కూడా చిన్న గాలికే కూలిపోయాయి. ఇలా అన్నీ ఫెయిల్యూర్స్ ను కలగలిపి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వంపై ట్రోల్స్ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సరిగ్గా నెల సమయం ముందు కాళ్లేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయాయి. అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వమే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల వేడి మొదలయ్యాక ఇలాంటి పరిణామాలు జరిగితే ఎంతటి నష్టం జరుగుతుందో ఆ ఘటన నిరూపించింది. తాజాగా ఇప్పుడు కూడా ఏపీలో ఎన్నికలు ఇంకో నెలన్నరలో జరగనున్నందున విశాఖలో జరిగిన ఈ బ్రిడ్జి ఫెయిల్యూర్ అధికార పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని అంటున్నారు. తెలంగాణలోని సెంటిమెంటే ఇక్కడ రిపీట్ అవుతుందని జగన్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.