రాజకీయాల్లో నిత్యం చురుగ్గా ఉండే ప్రజాప్రతినిధులు ప్రతిరోజు పొలిటికల్ కామెంట్స్ చేయడం పరిపాటి. అందులో ప్రతిపక్ష పార్టీ అయితే మరింత కామన్. అవకాశం దొరికితే అధికార పార్టీని టార్గెట్ చేయడమే వారి లక్ష్యంగా పెట్టుకుంటారు. అధికార పార్టీని టార్గెట్ చేసేవారిలో కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది.
అతను ఎప్పుడు ఎలా ప్రభుత్వంపై విరుచుకు పడతారో తెలియదు. ఒక్కోసారి ప్రభుత్వానికి అనుకూలంగానూ, ప్రతికూలంగానూ కామెంట్స్ చేస్తుంటారనే భావన ప్రజల్లో ఉంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన టిఆర్ఎస్ సభ్యులను డమ్మీలుగా అభివర్ణించారు.
సొంతపార్టీ ఎంఎల్ఎలతో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదని, అందుకే వారు డమ్మీలుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. జగ్గారెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోసం సాక్షాత్తు మంత్రులే ఒకానొక సందర్భాల్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ ఉంది.
మరీ అలాంటిదీ ఇక పార్టీ శాసన సభ్యులకు అపాయింట్‌మెంట్ దొరకాలంటే అది ఇంకా ఎంత కష్టమో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థతికి ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఆరు రోజులు దీక్ష చేస్తా
టిఆర్ఎస్ పార్టీ అంటే కెసిఆర్ కుటుంబ పార్టీ అన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కెసిఆర్ కుటుంబం మినహా మిగతా ఎంఎల్ఎలకు స్పష్టమైన ముందస్తు సమాచారం ఉండదనే అభిప్రాయమూ ఉంది. కెసిఆర్ అనుకున్న వారికి, కెటిఆర్ కోటరీలో ఉన్న ఎంఎల్ఎలకు, నేతలకు మాత్రమే సిఎం అపాయింట్‌మెంట్, ప్రభుత్వ లేదా పార్టీ పరమైన అంశాలు మాత్రమే తెలుస్తాయనే భావన ఉంది.
మిగతావారికి ఎలాంటి విషయాలు తెలియకుండా జాగ్రత్తలు పడుతారని సమాచారం. అలాంటి పరిస్థితుల మధ్య ప్రతిపక్ష పార్టీ సభ్యులకు సిఎంను కలిసే అవకాశం ఎక్కడ దొరుకుతుందని ప్రతిపక్షాలు తమ వాదనను వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై జగ్గారెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి సిఎంను కలవాలని భావించినా అనుమతి రాలేదని జగ్గారెడ్డి తెలిపారు.
అసెంబ్లీ వేదికగానే సమస్యలను ప్రస్తావిస్తానన్నారు. సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటుపై సిఎం రానున్న 15 రోజుల్లో హామీ నెరవేర్చకపోతే తాను ఆరు రోజుల దీక్ష చేపడతానని మీడియాతో ఆయన చెప్పారు. అన్ని సమస్యలపైన తాను ప్రభుత్వాన్ని నిలదీస్తానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉంటే సులువుగా సమస్యలు పరిష్కారమయ్యేవని ఆయన వెల్లడించారు.