రాజకీయం. ఎక్కడైనా… ఎప్పుడైనా… ఎలాగైనా… ఇన్నాళ్లూ అదే అనుకునే వారు. ఒక్క దేవుడ్ని మినహాయించే వారు. భారతీయ జనతా పార్టీ బలం పెరిగాక ఆ దేవుడూ రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేశాడు. అదృష్టం ఏమిటంటే ఇన్నాళ్లూ ఈ దేవుడు రాజకీయం తెలుగు రాష్ట్రాలలో రాలేదు. కాని ఇదిగో ఇప్పుడిప్పుడే ఇదీ వస్తోంది. అది కూడా పావన గోదావరి తీరాన అంతర్వేది లక్ష్మీ నరసింహుడి గుళ్లో. తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి పొందిన అంతర్వేది ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.
ఇక్కడ జరిగే ఉత్పవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు వేలాదిగా, లక్షలాది తరలివస్తారు. ఈ ఆలయానికి చాలా మహిమలున్నాయని ప్రచారం కూడా ఉంది. అంతటి విశిష్టతలున్న ఈ ఆలయం ఇప్పుడు రాజకీయ వివాదంలో కూరుకుపోయింది. ఆలయంలో ఉన్న రథం అగ్నికి ఆహుతి అయ్యింది. అంతే దాని చుట్టూ రాజకీయం రాక్షసంగా అల్లుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య రథాగ్ని రగులుతోంది. రథం కాలిపోవడం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది.
అబ్బే మాకేంటి సంబంధం. మా అభివృద్ధిని చూడలేక తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అటు అధికారంలోను లేక, ఇటు ప్రతిపక్షానికి కాకుండా పోయిన రఘురామకృష్ణం రాజు అయితే మరో ఆకు ఎక్కువే చదివి షార్ట్ సర్కూట్ అయితే మొత్తం రథం అంతా ఎందుకు కాలుతుంది అంటూ లాజిక్కులు తీస్తున్నారు. దేవుడి రథం కాలిపోవడం అశుభమని వేద పండితులు వాపోతున్నారు.
అయితే ఈ అశుభం ఎవరికో మాత్రం ఇదిమిత్తంగా చెప్పడం లేదు. ఒకవిధంగా చూస్తే అధికారంలో ఉన్న వారికే దీని ప్రభావం పడుతుంది కదా అనే వారూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రథం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు.ఇందులో ఏ ఒక్కరూ కూడా బాధ్యతగా మాట్లాడడం లేదని ప్రజలు అంటున్నారు. దేవుడా… నీ రథానికే దిక్కు లేకుండా పోయిందా… ఇక జీవిత రథాలు ఎలా నడపాలి మహాప్రభూ అని గగ్గోలు పెడుతున్నారు.
ఈవో సస్పెన్షన్
రథం కాలిపోయిన సంఘటనలో ఆలయ ఈవో సస్పెండ్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ప్రకటించారు. అంతే కాదు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు కూడా జరుపుతామని ప్రకటించారు. దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజలపై దర్యాప్తు జరుగుతోందని ప్రకటించారు. పనిలో పనిగా ప్రతిపక్ష నాయకులపై కూడా విరుచుకుపడ్డారు. మరోమాట… రథం అంటుకుపోవడంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారి హస్తం ఉందని అనుమానాలను వ్యక్తం చేసారు.