సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. భవిష్యత్‌ను భద్రంగా ఉంచుకునేందుకు అందుకు సరైన వేదికను, పార్టీలను ఎంచుకుంటున్నారు. తాజాగా గోదావరి జిల్లాల్లో పేరున్న జక్కంపూడి ఫ్యామిలీ కూడా జగన్‌కు హ్యాండివ్వబోతుందన్న ప్రచారం జోరందుకుంది. గతంలో వైఎస్‌కు సన్నిహితుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జక్కంపూడి రాజకీయ వారసులుగా జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ ఎంట్రీ ఇచ్చారు. ఐతే వైఎస్, రామ్మోహన్ రావు మరణం తర్వాత రాజా, గణేష్ వైసీపీలో జగన్‌కు అత్యంత నమ్మకస్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఐతే ఇప్పుడు పరిస్థితులు మారాయి. జక్కంపూడి కుమారులలో ఒకరైన గణేష్ వైసీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ మార్గాని భరత్‌తో విబేధాల కారణంగానే గణేష్ వైసీపీకి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ…తమ కుటుంబానికి రాజకీయాల్లో పట్టు కొనసాగాలంటే భవిష్యత్ ఉన్న పార్టీలో చేరాలని గణేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
జక్కంపూడి రాజాకు జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. ఆయన రాజా నగరం నుంచి ఎమ్మెల్యేగా ఓ సారి గెలిచి ఇటీవల ఎన్నికల్లో జనసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ జక్కంపూడి గణేష్ మాత్రం రాజమండ్రిలో రాజకీయాలు చేశారు. అక్కడ తమ కుటుంబానికి పట్టు తగ్గకుండా చూసుకున్నారు. ఎంపీగా తనకు సామర్థ్యం సరిపోవడం లేదని ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని చెప్పి భరత్ గత ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నారు. ఐతే ఇది జక్కంపూడి కుటుంబానికి నచ్చలేదు.
మార్గాని,జక్కంపూడి వర్గాలకు మొదటి నుంచి వివాదాలున్నాయి. మార్గాని భరత్‌కు జగన్ వైపు నుంచి ఎక్కువ సపోర్టు లభించింది. దీంతో జక్కంపూడి కుటుంబం ఏదో ఒకటి చేయాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ముందుగా ఒకరిని జనసేనలోకి పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు గణేష్ ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైతే..ఫ్యామిలీ అంతా జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.