సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళికి కష్టాలు తప్పట్లేదు. జైలు జీవితం నుంచి తప్పించుకున్నప్పటికీ..గుంటూరు సీఐడీ ఆఫీసుకు వెళ్లి రావడాన్ని మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఐతే రాజకీయాల నుంచి తప్పుకున్నానని, ఏ పార్టీతో తనకు సంబంధాలు లేవని గతంలో పోసాని చేసిన ప్రకటన ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్లే తెలుస్తోంది. ఎందుకంటే ఆయన సోమవారం తాడేపల్లి పరిధిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో కనిపించారు. వైసీపీ సెంట్రల్ ఆఫీసు ఇన్‌ఛార్జి హోదాలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోసాని కలిశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పోసానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే విద్వేషమే. ఆ పార్టీ పేరు వినిపిస్తే చాలు..ఇక తన నోటికి పని చెప్పేవారు. జగన్ పాదయాత్ర సమయంలోనూ పలు దఫాలుగా పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేశారు. పలువురు సినిమా నటులను వైసీపీకి దగ్గర చేయడంలోనూ ఆయన కీరోల్ ప్లే చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంతో పోసానికి కూడా పదవి దక్కింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కొంతకాలం పాటు పనిచేశారు. ఈ క్రమంలో పలుమార్లు మీడియా ముందుకు వచ్చిన ఆయన టీడీపీపైనా, ఆ పార్టీ అధినేతైనా, మంత్రి నారా లోకేష్‌పైనా అసభ్య పదజాలం వాడారు. ఇక జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సైతం ఆయన వదల్లేదు.
వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ బాగానే ఉన్నా..మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో పోసానికి కష్ట కాలం మొదలైంది. అయితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పోసాని…తాను చేసింది తప్పేనని, ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనని, బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని వేడుకున్నారు. చంద్రబాబు, పవన్ లు పెద్దగా పట్టించుకోకున్నా…ఆయన గత విన్యాసాలను టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం మరిచిపోలేదు. తమ నేతలను పోసాని అసభ్యపదజాలంతో దూషించారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గత నెలలో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు ..పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.
పోసాని అరెస్టు తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పోసాని కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి బెయిల్ ఇప్పించేందుకు ఏకంగా మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందాన్ని రంగంలోకి దింపారు. అయినా కూడా పని కాకపోవడంతో జడ్జి ముందు పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా వైసీపీ లాయర్లే పోసానికి బెయిల్ ఇప్పించగా..చాలా రోజుల జైలు జీవితం తర్వాత పోసాని బయటకు వచ్చారు. ఆ తర్వాత వారంలో రెండు రోజులు గుంటూరు CID ఆఫీసుకు వచ్చి పోతున్నారు. ఐతే తనకు బెయిల్ ఇప్పించారనో, మరీ అరెస్టు సందర్భంలో అండగా నిలిచిందనో..వైసీపీని మరిచిపోలేకపోతున్నారు పోసాని. రాజకీయాలను వదిలేశానని చెప్పిన పోసాని ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ ఆఫీసులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.