పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు విచారణ సాగిస్తుండగానే..మరోవైపు కొంతమంది విద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందులో వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు బెన్నిలింగం ఒకరు.
పాస్టర్ ప్రవీణ్ పగడాలది కచ్చితంగా హత్యే..అందులో ఎలాంటి అనుమానం లేదు..ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు బెన్ని లింగం. మమ్మల్ని కెలకొద్దు..మేం మంచివాళ్లం కాదు మూర్ఖులం..మాతో పెట్టుకోవద్దు..ఖబడ్దార్ రెచ్చిపోయారు. ఐతే బెన్నిలింగం ఇప్పుడు మాట మార్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయనపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు.
నార్త్‌జోన్ DSP శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను విచారించింది. ఆ రోజు జనాల్ని చూసి ఆవేశంలో మాట్లాడానని.. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని బెన్నిలింగం చెప్పినట్లు తెలుస్తోంది. పాస్టర్‌ను హత్య చేశారనడానికి తన వద్ద ఆధారాలేవీ లేవని చెప్పినట్లు తెలిసింది. తన వీడియోను ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేశారని కూడా బెన్నిలింగం ఆరోపించినట్లు సమాచారం. సాయంత్రం వరకు విచారించిన పోలీసులు ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని విడిచిపెట్టారు. ప్రవీణ్ మృతిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరామని సీఐ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పామన్నారు.
ప్రవీణ్ పగడాలది హత్యేనని బలంగా వాదిస్తున్న వారికి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. హత్య అని చెప్పడానికి గల ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పాస్టర్ అజయ్‌బాబుపైనా రాజానగరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐతే ఆయనను హైదరాబాద్‌లో నమోదైన మరో కేసులో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.