విక్టరీ వెంకటేష్ నటించిన యాక్షన్ మూవీస్ లో చాలా ప్రత్యేకమైనది ‘జయం మనదేరా..!. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2000, అక్టోబర్ 7న విడుదలై.. అప్పట్లో ఘనవిజయం సాధించింది. సరిగ్గా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో వెంకటేశ్ తండ్రీకొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే.. ఈ యాక్షన్ రివెంజ్ డ్రామా లో సౌందర్య కథానాయికగా నటించగా.. భానుప్రియ, మీనాకుమారి, జయప్రకాశ్ రెడ్డి, రమాప్రభ, యల్.బీ శ్రీరామ్, తణికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాయి.
ప్రజల దృష్టిలో దేవుడిగా పిలవబడే మహదేవనాయుడిని ఆ ఊరిని పీడించే కొందరు దుర్మార్గులు, అతడి సొంత బంధువులే చంపేస్తారు. అతడి అనుచరులు కొడుకు రుద్రమనాయుడ్ని వేరే చోట పెంచుతారు. పెరిగి పెద్దవాడైన అతడు .. తన తండ్రిని చంపిన వారిపై ఎలా పగతీర్చుకుంటాడు అనేదే మిగతాకథ. మహదేవనాయుడిగానూ, రుద్రమనాయుడిగానూ తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేసిన వెంకీ అభినయం ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ‘బాహుబలి’ స్టోరీ లైన్ కూడా ఈ సినిమా స్టోరీ లైన్ నే పోలి ఉంటుంది. అలాగే యన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ కూడా ఇదే పాట్రన్ తో నడుస్తుంది.