గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఎన్రోల్ మెంట్ ప్రక్రియకు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ఆ ప్రక్రియను వేగవంతం చేసాయి. వీలైనంత ఎక్కువగా ప్రచారాలు నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదుచేసుకోవాలని కోరుతున్నారు. దీంతో ఓటరు నమోదుకు నియోజక వర్గాల వారిగా బారీగానే స్పందన వస్తుంది. గ్రాడ్యుయేట్లు ఓటర్గా నమోదు చేసుకునేందుకు ఆన్ లైన్ తలుపులు తడుతున్నారు. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ప్రచార కార్యక్రమాలు బాగానే ఉన్నాయి.. స్పందన బాగానే ఉంది. ఆ తరువాతే అసలు చిక్కులు మొదలవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే గెజిటెడ్ అధికారి సిగ్నేచర్ తప్పని సరి. ఓటరు నమోదు కోసం గెజిటెడ్ సిగ్నేచర్ చేయించుకునేందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు ఓటర్లు. ఎవరి తలుపు తట్టినా పెద్ద స్పందన ఉండటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాస్తో కూస్తో అధికారులు పరిచయం ఉన్నవారికి, నగరాల్లో ఉన్న వారికి ఇబ్బదులు లేక పోయినా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలకు యువకుల నుండి ఫిర్యాదులు అందుతుండటంతో ఏం చేయాలన్న సమాలోచనలు చేస్తున్నాయి. గెజిటెడ్ సిగ్నేచర్ చేయిస్తే గాని తమకు ఓట్లురాని పరిస్థితి . లక్షలాది మంది ఓటర్లకు ఎక్కడ నుండి గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాలంటూ తలలు పట్టుకుంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ కి సైతం ఈ బెడద తప్పడం లేదు., రోజూ వేలాది మంది కార్యకర్తలు టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు. ఎన్రోల్ మెంట్ చేసుకోవాలని చెబుతున్న పార్టీ లు, నేతలు నమోదుకు కీలకమైన సంతకం ఎక్కడ చేయించుకోవాలో అర్థంకాక కార్యకర్తలకు చెప్పలేక పోతున్నారు.
ఈ విషయంలో మంత్రి తలసాని ఓ అడుగు ముందుకు వేసారు. తమ కార్యకర్తలకు ఎవరికైనా గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎన్రోల్ మెంట్ కొసం గెజిటెడ్ సిగ్నేచర్ కావాల్సి వస్తే తమ పీఎస్ లతో చేయిస్తా అంటూ ఆఫర్ ఇచ్చారు. సంతకం కోసం ఏ కార్యకర్త ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. తన కార్యాలయాన్ని సంప్రదిస్తే గెజిటెడ్ సిగ్నేచర్ చేయించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రెండు ఎమ్మెల్సీ నియోజక వర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే తరహాలో ముందుకు వచ్చి సంతకాలు చేయిస్తే ఇబ్బందులు లేకుండా ఎన్రోల్ మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుందంటున్నారు ఓటర్లు.











