విశాఖపట్నంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది. విశాఖ నగరం ఐటీ, పారిశ్రామిక, పర్యాటక, సేవా రంగాల్లో రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖకు పేరుంది. ఐతే విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మధురవాడలో ఫిన్‌టెక్ సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 80 నుంచి 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఫినెటెక్ సేవలతో విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రమే మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫిన్‌టెక్ సిటీ అంటే ఏంటి –
బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ అనుబంధ రంగాల సంస్థలు ఒకే చోట కార్యకలాపాలు, సేవలు అందించేలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడమే ఫిన్‌టెక్ సిటీ లక్ష్యం. అందులో
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తారు. ప్రజలకు ఆర్థిక సేవలను మరింత దగ్గర చేయడం, జీవన ప్రమాణాలు పెంచడంలో ఫిన్‌టెక్ కీలకపాత్ర పోషిస్తుంది. రెండెళ్ల కిందట తమిళనాడులోని నందంబక్కంలో 56 ఎకరాల్లో ఇదే తరహా ప్రాజెక్టు ప్రారంభించారు. రూ.12 వేల కోట్ల పెట్టుబడులతో 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళిక చేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో అదే తరహా ప్రాజెక్టుకు ముందడుగు పడుతుంది.
ఫిన్‌టెక్ సిటీ కోసం మధురవాడలోని ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని భూములను గుర్తించారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థకు కొమ్మాది దగ్గర ఉన్న 80 ఎకరాల స్థలాన్ని ఈ ప్రాజెక్టు కోసం అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం – PPP మోడల్‌లో చేపట్టనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన డెవలపర్లకు స్థలం ఇచ్చి మౌలిక వసతులను కల్పించే బాధ్యత అప్పగిస్తారు. వారు మొత్తం స్థలాన్ని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువస్తారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలంలో కొంత వాటా వారికి ఇస్తారు. అందులో నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు. విలాసవంత హోటళ్లు, ఐటీ సేవలకు అప్పగించొచ్చు. ప్రభుత్వ వాటాగా ఉన్న స్థలాన్ని బ్యాంకింగు, ఫైనాన్స్, బీమా సంస్థలకు – PPP కింద అప్పగిస్తారు. ఐటీ, బీపీవో కేంద్రాలకు స్థలాలు కేటాయిస్తారు. త్వరలోనే డెవలపర్ ఎంపికకు టెండర్లు పిలవనున్నారు.
ఇక విశాఖలో ఆర్థిక సంబంధ సేవలకు కంపెనీలు ఎంతవరకు ఆసక్తి చూపుతాయో మొదట పరిశీలించనున్నారు. ఇందుకోసం దేశంలోని ప్రధాన నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్డు షోలు నిర్వహించాలని చూస్తున్నారు. ముంబయి, బెంగళూరు, దిల్లీ, చెన్నై మరికొన్ని చోట్ల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ముందుకొచ్చే కంపెనీల ఆధారంగా ఎంత విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపట్టాలో నిర్ణయిస్తారు. జిల్లా కలెక్టరు హరేంధిరప్రసాద్ ప్రాజెక్టు బాధ్యత తీసుకున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని ఆయన తీసుకువెళ్లారు.