అభిమానుల కోసం కమల్ హాసన్ అందించిన పుట్టిన రోజు కానుక వచ్చేసింది. తన 66వ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తను నటిస్తున్న 232వ చిత్రం టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమా పేరు ‘విక్రమ్’. ఈ టైటిల్ టీజర్ ను ఈరోజు సాయంత్ర విడుదల చేశారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపైనే ఈ చిత్రం రూపొందుతోంది. ఈ బ్యానర్ పై కమల్ అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
నిజానికి ఇది కమల్ అందించిన కానుక కాదు పుట్టిన రోజు సందర్బంగా కమల్ కు లోకేష్ కనకరాజ్ అందించిన కానుక. మీరు ఎప్పుడూ మాకు స్పూర్తిని ఇస్తూ ఉండాలంటూ లోకేష్ కనకరాజ్ కమల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. ఒకానొక సమయంలో అక్కడ ఓ దెయ్యం నివసించింది అంటూ ఆ మధ్య ఓ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే ఉత్కంఠకు ఈరోజు టీజర్ లోనూ చోటు కల్పించారు.
యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందట. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. కమల్ అభిమానులకు మాత్రం ఇది పండుగ లాంటి వార్తే. గన్ కల్చర్ ఈ సినిమా కథాంశలా కనిపిస్తోంది. చక్కటి మీసకట్టుతో పవర్ ఫుల్ పాత్రతో కమల్ కనిపించారు. అరిటాకుల్లో భోజనం వడ్డించి పెట్టి ఆ భోజనం టేబుల్ కింద పెట్టిన ఆయుధాలతో వారిని తుదముట్టించేలా టీజర్ కు రూపకల్పన చేశారు.











