ఐఎండీబీ టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాలో ఈ ఏడాది విడుదలైన కాంతారా సినిమాకి చోటు దక్కింది. దక్కడమే కాదు పొన్నిసెల్వన్, సీతారామం చిత్రాలను దాటి అగ్రస్థానంలో ఉంది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? గీతా ఫిలింస్ దీన్ని తెలుగులో అనువదించి విడుదల చేస్తోంది. ఈ సినిమాలో హీరోగా రిషబ్ శెట్టి నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. పైగా ఇది కన్నడ మూవీ. ఈమధ్య కన్నడ చిత్రాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బీ శెట్టిలను ట్రిపుల్ ఆర్ గా పిలుస్తుంటారు.
ఇటీవల చార్లీ 777, గరుడ గమన వృషభ వాహన చిత్రాలు తీశారు. ఇప్పుడు తీసిన కాంతారా సెప్టెంబరు 30న విడుదల చేశారు. తెలుగు అనువదించిన సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హిందీ వెర్షన్ 14న విడుదలవుతోంది. వీరు తీసిన చార్లీ 777 చిత్రం ఐఎండీబీ టాప్ 250 జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ కాంతారా చిత్రం 36వ స్థానంలో ఉంది. సీతారామం 39వ స్థానంలో, పొన్నియన్ సెల్వన్ 182వ స్థానంలో కొనసాగుతున్నాయి. మాధవన్ సినిమా రాకీ ట్రై: ది నంబి ఎఫెక్ట్ 1వ ర్యాంకుతో అగ్రస్థానంలో ఉంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్టయిన సీతారామంను సైతం ఈ సినిమా దాటేసిందని చెప్పాలి.
కాంతారా సినిమాకి ఐఎండీబీ 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ సంవత్సరం విడుదలైన చార్లీ 777 (ర్యాంక్7), విక్రమ్ (ర్యాంక్53), మేజర్ (ర్యాంక్ 165), జనగణమన (ర్యాంక్ 108), కేజీఎఫ్ 2 (ర్యాంక్ 134), కౌన్ ప్రవీణ్ తాంబే (ర్యాంక్ 117), ఆర్ఆర్ఆర్ (ర్యాంక్ 191), హృదయం (ర్యాంక్ 206) సాధించాయి. ఇంతకీ కాంతారా సినిమాలో అంతగా ఆకట్టుకునే అంశం ఏముందో చూద్దాం. ఇది ప్రకృతికీ మనిషికీ మధ్య సాగే కథ. కాంతారా అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. అటవీ సంపదను దోచుకోవడం, ఈ దోపిడీని అరికట్టడం, మూఢనమ్మకాల తదితర అంశాల మేళవింపుతో ఈ సినిమాని రూపొందించారు.











