గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తి చేసుకుని స్పెయిన్ వెళ్లిన నయనతార దంపతులు ఆ తర్వాత తమకు కవల పిల్లలు పుట్టారంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినప్పటి నుంచి వారికి మనశ్శాంతి లేకుండా పోయింది. తొందర పడి ఒక కోయిల ముందే కూస్తే ఇలాగే ఉంటుంది మరి. తమకు పిల్లలు ఎలా కలిగారో సరైన సమయంలో అన్నీ తెలుస్తాయంటూ మరో ట్వీట్ చేశారు. ఇండియాలో సరోగసీపై నిషేధం ఉంది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప… సరోగసిని ప్రోత్సహించకూడదు.. ఈ చట్టం జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చిన సంగతి చాలామందికి తెలియదు. నయన్ అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం సోషల్ మీడియా వ్యాప్తంగా గానే కాకుండా.. అటు తమిళనాడుతో పాటు తెలుగులో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
చట్టానికి వ్యతిరేకంగా సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. సుప్రీంకోర్టు నిషేధించినఈ విధానాన్ని ఈ దంపతులు ఎలా అమలు చేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరికి సహకరించిన హాస్పిటల్ యాజమాన్యంపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై గురువారం నుంచి మెడికల్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేయనున్నారు. జూన్ 9న నయనతార -విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు కూడా ఐదేళ్ళు పూర్తికావాలి. కానీ వీరిద్దరూ ఐదు నెలలు తిరగకముందే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇదే అసలు వివాదానికి దారితీసింది.
మెడికల్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిది సరోగసీ విధానం ద్వారా పిల్లలు పుట్టేందుకు నయనతార దంపతులకు సహకరించిన వైద్యుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఈ ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ ఆస్పత్రికి చెందిన కొందరు వైద్యులు నయనతారకు ఈ ఆలోచన ఇవ్వడమే కాకుండా వారే దగ్గరుండి పిల్లలు పుట్టించినట్టు సమాచారం. ఈ విషయంపై వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ విధానాన్ని ఎంచుకునే ముందు నయనతారకు దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, చిక్కులను వివరించారా? లేదా? అన్నది తెలియాల్సిఉందన్నారు. సాధారణంగా ఒక జంట సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనివ్వాలంటే అందులోని నిబంధనలను ఆ జంటకు వైద్యులు వివరించాల్సి ఉంటుందన్నారు.
సరోగసీ విధానంపై 99 శాతం మందికి పూర్తి అవగాహన లేదని వివరించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఆస్పత్రి యాజమాన్యానికి అపరాధం విధిస్తారన్నారు. నయనతారపై చర్యలు తీసుకోవడం లేదా ఆమెకు జరిమానా విధించడం చాలా తక్కువగా ఉంటాయని, ఒక వేళ నయనతార దంపతులు ముందుగానే సరోగసీ కోసం రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఇందులో సమస్యే లేదని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై గురువారం నుంచి మెడికల్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేయనున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.











