నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత ఘన విజయాన్ని సాధించారు. మొదటి రౌండ్ లోనే ఆమె విజయాన్ని సాధించడం విశేషం. మొదటి రౌండ్‌లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలిపు ఖరారు కాగా, మొత్తం రెండు రౌండ్లలో భారీ ఓట్లు పొందింది. మొదటి రౌండ్‌లోనే 531 ఓట్లతో కవిత విజయం ఖారారైంది. మొత్తం 823 ఓట్లు నమోదయిన ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా చెల్లని ఓట్లు 10గా నమోదయ్యాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ డిపాజిట్లు కోల్పోయారు.
ఇందూర్‌లోని ప్రభుత్వ పాల్‌టెక్నిక్ కళాశాల మైదానంలో ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పరిశీలకులు వీర బ్రహ్మయ్య కౌంటింగ్ సరళిని పరిశీలించారు. అక్టోబర్ 9న జరిగిన ఈ ఎన్నికలలో అధికార పార్టీ టీఆర్ఎస్ తరుపున కవిత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనే ఆశతో విపక్షాలు ఈ ఎన్నికపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ రోజు ఉదయం పోలింగ్ లో వారి ఆశలకు బ్రేక్ పడింది. మొదటి రౌండ్ లోనే ఆమె విజయ దుందుభి మోగించారు.
క్యాబినెట్ లో బెర్త్ ఖాయం
టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు. 2019, పార్లమెంట్ ఎన్నికలలో ఆమె నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడంతో మంత్రివర్గంలో స్థానం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.











