తెలంగాణలో రెవెన్యూ శాఖ పనితీరుపై సర్వత్రా వ్యతిరేకత పెరుగుతోంది. గతంలో ఆ శాఖలోని వారి అవినీతిపై అనేకానేక కథనాలు వచ్చినా పెద్దగా పట్టించుకున్న వారు లేరు. “మన పని అయితే చాలు“ అనే ధోరణిలోనే వ్యవహరించారు. అయితే ఆ తర్వాత్తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజల్లో కూడా రెవెన్యూ శాఖలోని అధికారుల పని తీరుపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయా రెడ్డిని ఓ రైతు కిరోసిన్ పోసి కాల్చేసిన సంఘటనతో తెలంగాణ ఒక్కటే కాదు… మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఉలిక్కి పడింది. మరో మహిళా తహశీల్దార్ అవినీతి కూడా బయటపడడంతో రెవెన్యూ అధికారుల అవినీతి పరాకాష్ట ప్రజలకు అర్ధం అయ్యింది.
ఈ వరుస సంఘటనల తర్వాత రైతులు తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లే సమయంలో తమ వెంట పెట్రోల్ బాటిళ్లు తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ కీలకమైన ప్రకటన చేశారు. అంతే ఆ ప్రకటనతో రెవెన్యూ ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. ఇంతకీ ఆ ప్రకటన గుర్తుందా…? ఏం లేదు… రెవెన్యూ శాఖను రద్దు చేస్తానని, ఆ శాఖ ఉద్యోగులను వేరే శాఖల్లో కలిపేస్తానని ప్రకటించారు.
అంతే కాదు భూముల రిజిస్ట్రేషన్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇక జిల్లా కలెక్టర్ల ఆధీనంలోనే జరుగుతాయని ప్రకటించారు. అంతే రిజిస్ట్రేషన్ శాఖల్లో పని చేసే ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. అయితే సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణలోకి రాలేదు కాని మళ్లీ ఇప్పుడు ఆ ప్రకటన అమలు చేస్తే బాగుంటుందనే ఆశ సామాన్యుల్లో వస్తోంది.
నాగరాజు కేసులో వెలికివస్తున్న అనకొండలు
దీనికి కారణం కీసర తహశీల్దార్ నాగరాజును అవినీతి నిరోథక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ రూ. 1.1 కోట్లతో పట్టుకోవడమే. ఈ నాగరాజు అవినీతి తీగను లాగుతున్న అవినీతి నిరోదక శాఖ అధికారులు విస్తుపోయే సమాచారం దొరుకుతోంది. అదేమంటే తహశీల్దార్ నాగరాజుతో చేతులు కలిపి అరెస్టు అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ మాజీ నక్సలైట్ కావడమే.
శ్రీధర్ పైన వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక కేసులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అంటే తహశీల్దార్లు అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఎలాంటి మార్గాలనైనా వాడుకుంటున్నారని ఈ సంఘటన రుజువు చేసింది. తెలంగాణాలోని చాలా జిల్లాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తహశీల్దార్లకు సంబంధాలున్నాయి. కొందరు తహశీల్దార్లకు ఆ రియల్టర్లతో వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందని వెలుగులోకి వస్తోంది.
ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రియల్టర్ల నుంచి డబ్బు గుంజుతున్న అధికారులు ఆ అస్త్రాన్ని సామాన్యులపై కూడా ప్రయోగిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే రైతులు, సామాన్యులు చేతిలో పెట్రోలు బాటిళ్లతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు- లొంగిపోయిన నక్సలైట్లతో సంబంధాలున్నాయంటే వారు ఎంతకు తెగించారో అర్ధం చేసుకోవచ్చునని కొందరంటున్నారు.
ఈ తాజా సంఘటనతో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు ఉన్న కోపం మరింత పెరుగుతుందని, ఈ కోపం ఏ రూపం తీసుకుంటుందో కూడా తెలియదని నిజాయితీ పరులైన కొందరు రెవెన్యూ ఉద్యోగులు భయపడుతున్నారు. కొందరి అత్యాశ, అడ్డదారులు మొత్తం శాఖ మీద ప్రభావం చూపుతాయని వారంటున్నారు.