సమైక్య రాష్ట్రంలో వారంతా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు. కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన వారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి ప్రభావం ఏమీ కనిపించడం లేదు సరికదా కనీసం వారేం చేస్తున్నారో కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలియడం లేదు. ప్రస్తుతం వారి పరిస్థితి ‘ఏది తల్లీ.. నిరుడు కురిసిన హిమ సమూహములు..’ అన్నట్లుగా మారింది. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా…! సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకులు.
పిసిసి అధ్యక్ష పదవిని అలంకరించి ముఖ్యమంత్రి రేసులో బోల్తా పడిన సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ తానే అయి ప్రభుత్వాన్ని నడిపించిన కేవీపీ రామచంద్ర రావు, ఉత్తరాంధ్ర జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడిన ధర్మాన ప్రసాద రావు, సమైక్య రాష్ట్రంలో మంత్రిగానూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడి గాను చక్రం తిప్పిన రఘువీరారెడ్డి, సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి. వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు.
డీఎస్.. కండువా మారినా జాడ లేదు…
రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పెద్దవాడు, సీనియర్ నాయకుడు అనే గౌరవంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. ఏడాది పాటు ఇద్దరికీ మధ్య సఖ్యత బాగానే నడిచింది. డి. శ్రీనివాస్ కుమారుడి కారణంగానో మరే ఇతర కారణాలు తెలియదు గానీ డీ. శ్రీనివాస్ అప్పటినుంచి మిన్నకుండిపోయారు. పార్టీ కార్యక్రమాలలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలలో కానీ ఆయన జాడ కనబడటం లేదు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన కుమారుడు డి. అరవింద్ విజయం సాధించినప్పటి నుంచి శ్రీనివాస్ పూర్తిగా తెరమరుగయ్యారు. ఆయన బీజేపీలో చేరతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు.
కేవీపీ ‘సమైక్య ప్లకార్డుల’ తర్వాత ఎక్కడ…
సమైక్య రాష్ట్రం కోసం రాజ్యసభలో ప్లకార్డు పట్టుకుని రోజుల తరబడి నిలుచున్న కే.వీ.పీ. రామచంద్ర రావు పరిస్థితి అలాగే ఉంది. దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి ఆత్మగా పేరున్న కే.వీపీ. రామచంద్ర రావు ఎక్కడా కానరావడం లేదు. ఆయన ప్రకటన గాని, విలేకరుల సమావేశాలు గానీ, ఆయన ఫోటో గాని మీడియాలో వచ్చిన దాఖలాలు ఏమీ లేవు.
పదవిదిగగానే రఘువీరా గాయబ్..
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రఘువీరారెడ్డి పదవీ కాలం ముగిసిన తర్వాత ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆయన సొంత జిల్లా అనంతపురం లో కూడా రఘు వీరారెడ్డి వార్తలు వస్తున్న దాఖలాలు లేవు. ఆయన ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియడం లేదు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు.
అలకగృహంలో ధర్మాన…
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ధర్మాన ప్రసాదరావు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అందరూ ఆశించారు. చిత్రంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావు కాకుండా ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. అంతేకాదు ఇటీవలే ప్రమోషన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని కూడా చేశారు. ఈ పరిణామాలతో ధర్మాన ప్రసాద్ కినుక వహించిన ట్లు సమాచారం. పేరుకు ఆయన ఎమ్మెల్యే గానీ పెత్తనమంతా తమ్ముడు కృష్ణదాస్‌దే. ధర్మాన ప్రసాద రావు తన ఉనికిని చాటుకునేందుకు రెండు నెలలకో, మూడు నెలలకో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించడం లేదు.
కిరణ్.. మసకబారిపోయినట్టేనా..
కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ క్రెడిట్ ఒక్కటే మిగిలింది. రాష్ట్రం రెండు ముక్కలనూ తిరిగి అతికించేస్తానని ప్రతిజ్ఞలు చేశారు. కూలిపోయిన బెర్లిన్ గోడ ఇటుక ముక్కని కూడా చూపించారు. అంతన్నారు.. ఇంతన్నారు.. చెప్పు గుర్తుతో ఎన్నికల్లోకి దిగారు. అంతే ఓడిపోగానే.. అస్సలు కనిపించడం లేదు. మధ్యలో భాజపా వైపు మొగ్గుతారనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఏమాత్రం యాక్టివ్‌గా రాజకీయాల్లో కనిపించడం లేదు.
బడా నాయకులుగా పేరొందిన వీరంతా ఇప్పుడు మిన్నకుండి పోవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. సమైక్య రాష్ట్రం విడిపోవడంతో వీరి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.











