తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహంగా ఉన్నారు. ఒక పేరు ఎవరైనా చెప్పినా…. తన కంట పడినా ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడుతున్నారు. ఇదంతా ఎవరి మీద అనుకుంటున్నారా. కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాధుల మీద.
ఇంతకు ముందు ఏదో చూసి చూడనట్లు వ్యవహరించిన కల్వకుంట్ల వారు ఇప్పుడు చూడని దానిపై కూడా కస్సు బుస్పులాడుతున్నారు. ఆ మధ్య శాసనసభ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకురానున్న విద్యుత్ బిల్లుపై చాలా ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. సభలో మాట్లాడడమే కాదు.. ప్రతిపక్షమైన కాంగ్రెస్ వారిని కూడా కలుపుకుని విద్యుత్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.
ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక విధంగా చెంపపెట్టు వంటిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ తీర్మానంతో బీజేపీయేతర రాష్ట్రాలు కూడా విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నాయి.
నిన్న శుభాకాంక్షలు.. నేడు నిప్పులు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజున తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు. అది ఏదో సాధారణంగా చెప్పిన శుభాకాంక్షలు కాదు. ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యలు చేశారు. “దేశానికి ఉజ్వల భవిష్యత్ ను అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి“ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
అంతే కాదు.. ఆయన నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తనకు ఎంతో ఉందని కూడా అన్నారు. అంతే ఒక్క రోజు గడిచింది. ప్రధాని తీసుకు వస్తున్న వ్యవసాయం బిల్లుపై అంతెత్తున లేచారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు అన్నారు. ఈ బిల్లు రైతులను ఇబ్బందుల పాలు చేసి కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూర్చే బిల్లు అని విరుచుకుపడ్డారు. “ఈ బిల్లు తేనే పూసిన కత్తి“ అని ఘాటుగా విమర్శించారు.
కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లును రెండు సభలలోనూ తీవ్రంగా వ్యతిరేకించాలని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంపీలను ఆదేశించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ బిల్లులో రైతులు తమ పంటను ఎక్కడికైనా తీసుకువెళ్లి అమ్ముకోవచ్చునని ఉన్నా… ఆ వెసులుబాటు మాత్రం వ్యాపారులకే ఉన్నట్లుగా బిల్లులో పొందుపరిచారని కేసీఆర్ అన్నారు.
మక్కల దిగుమతిపై తగ్గింపా..
మక్కల దిగుమతిపై ఉన్న సుంకాన్ని 50 శాతం నుంచి 35 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించారని కేసీఆర్ చెప్పారు. అయితే. ఇప్పటికే దేశంలో 70 నుంచి 75 లక్షల టన్నుల మక్కలు దిగుమతి అయ్యాయని, ఇప్పుడు సుంకం తగ్గించి ఎవరికి మేలు చేస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
“మన దేశంలోనే మక్కలు విపరీతంగా పండాయి. దీనిని వదిలేసి సుంకం తగ్గించి మక్కలు దిగుమతి చేసుకుంటే ఎవరికి లాభం చేసినట్టు “ అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్రంపై ఇక నిప్పులు కురిపించే పనిలో పడినట్లుగా తెలుస్తోంది.











