బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న అభిమానిని నాగార్జున పరామర్శిస్తే అంతకన్నా ఆమెకు కావలసింది ఏముంటుంది. వివరాల్లోకి వెళితే ఆమె పేరు లక్ష్మి… ఊరు నెల్లూరు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో ఆమె బాధపడుతోంది. ఇప్పటికే మూడు ఆపరేషన్లు కూడా జరిగాయి. చివరిసారిగా జరిగే నాలుగో ఆపరేషన్ కు వెళ్లాల్సి ఉంది. అంతా ఓకే గానీ ఆమెకు హీరో నాగార్జున అంటే వీరాభిమానం.
ఒక్కసారైనా నాగార్జునతో మాట్లాడాలని ఆమె కోరిక. విషయం తెలిసి నెల్లూరు కు చెందిన ఎం. ఆదిత్య రెడ్డి ఈ విషయాన్ని నాగార్జునకు చేరవేశారు. వెంటనే నాగార్జున నుంచి ఆమెకు జూమ్ వీడియో కాల్. ఆమె ఆనందానికి అవధులు లేవు. తన అభిమాన హీరో ఇంత త్వరగా తనకు ఫోన్ చేస్తారని ఆమె ఊహించలేకపోయింది. అభిమానుల కోరికలను మన్నించడంలో హీరోలు ఒక్కోసారి ఎంత త్వరగా స్పందిస్తారో అద్దం పట్టే సంఘటన ఇది.











