సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పథకాల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో మూడు పథకాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే జూన్‌లోపు అమలు చేసేందుకు సమాయత్తం అవుతోంది.
శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గకూడదని టీడీపీ పోలిట్‌బ్యూరో నిర్ణయించింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ప్రతీ హామీపై రివ్యూ చేశారు పోలిట్‌బ్యూరో సభ్యులు.
వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచేలోపు ఎంతమంది వాటిలో చదువుతూ ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం అందించాలని పొలిట్‌బ్యూరోలో నిర్ణయించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే మొత్తం కలిపి రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జూన్‌లోపు ప్రారంభించాలని నిర్ణయించింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఖాతాల్లో జమ చేస్తోంది సర్కార్. సీఎం చంద్రబాబు సైతం ప్రతీ నెల ఓ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు సైతం పెన్షన్ పెంచి అందిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు దీపం స్కీం కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని సైతం ఇప్పటికే అమల్లోకి తెచ్చింది కూటమి సర్కార్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాల్ విసురుతున్నప్పటికీ ఇచ్చిన హామీల విషయంలో వెనుకడుగు వేయొద్దన్న పట్టుదలతో ఉంది కూటమి సర్కార్. జగన్ హయాంలో దాదాపు రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులు చేయడంతో వాటికి నెల,నెల వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి.దాంతో పాటు అభివృద్ధి పనులను పరుగెత్తించాలి. దీంతో పథకాల అమలు కత్తి మీద సాము లాంటిదే.











