విజయ్ సేతుపతిని ఒక స్టార్ హీరోగా చెప్పుకోవడం కన్నా, అతను ఓ విలక్షణ నటుడు అనుకోవడమే కరెక్ట్. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తానంటూ ఆయన గిరి గీసుకుని కూర్చోడు. హీరోతో సమానమైన పాత్రలు చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడడు. ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూ, అదే భాషలో విలన్ గా చేయడానికి ఎవరూ సాహసం చేయరు. హీరోగా అవకాశాలు తగ్గుతాయేమోనని ఆలోచన చేస్తారు. అలా జంకేవారు ఇతర భాషల్లో విలన్ పాత్రలు చేయడానికి మాత్రమే అంగీకరిస్తారు. కానీ విజయ్ సేతుపతికి అలాంటి భయాలేమీ లేవు. అందువల్లనే విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలు ఆయన ఖాతాలోకి ఆనందంగా చేరిపోతుంటాయి.
విజయ్ సేతుపతి తాజా చిత్రంగా రూపొందిన ‘మాస్టర్’ చిత్రం ఈ రోజునే తమిళనాట భారీస్థాయిలో విడుదలైంది. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. విజయ్ కి తమిళనాట విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అందువలన అక్కడ థియేటర్లు జాతరను గుర్తుచేస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ ‘జేడీ’ పాత్రను పోషించగా, ‘భవాని’గా ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించాడు. ఇద్దరూ కూడా తమకి ఇచ్చిన పవర్ఫుల్ పాత్రలను నువ్వా? నేనా? అన్నట్టుగా చేశారట. దాంతో జేడీ పాత్రతో సమానమైన క్రేజ్ భవాని పాత్రకి దక్కుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో జువైనల్ హోమ్ లో బాల నేరస్థులను ఉపయోగించుకుంటూ అరాచకాలకు పాల్పడే భవాని పాత్రలో విజయ్ సేతుపతి అలా కుదిరిపోయాడట. ఆయన లుక్ .. మేనరిజం ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రతినాయకుడి పాత్రను మలిచిన తీరు చాలా డిఫరెంట్ గా ఉందని చెబుతున్నారు. మానవత్వం మచ్చుకైనా కనిపించని ఆ పాత్రలో విజయ్ సేతుపతి చాలా సహజంగా నటించాడని అంటున్నారు. ఇక హీరో విజయ్ తో విలన్ గా నేరుగా తలపడే సన్నివేశాల్లో విజయ్ సేతుపతి నటన నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకుంటున్నారు. విజయ్ సేతుపతి వైపు నుంచి చూస్తే మాత్రం, విలన్ గా ఇది ఆయన విశ్వరూపమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.