తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన తరువాతే తెలుగు జాతికి విశిష్ట గుర్తింపు లభించిందని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని జస్టిస్ ఎన్వీ రమణ ఓ ప్రకటన విడుదల విడుదల చేశారు. ఎన్టీఆర్ జనరంజక పాలన అందించారని, ఆయన అందించిన పాలన ప్రస్తుతం దేశమంతటా అనుసరణీయమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాధించిన విజయాలు కీర్తించదగినవని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
విభిన్న రంగాల్లో మహా నాయకుడిగా, విశ్వ విఖ్యాతుడిగా నిలిచిన ఎన్టీఆర్ నూరవ ఏట ప్రవేశించారని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన తరువాతే తెలుగు జాతికి విశిష్ట గుర్తింపు లభించడం ఆరంభించిందని ఆయన తెలిపారు. అఖిలాంధ్ర ప్రజానీకం ఆయనకు నీరాజనాలు పట్టి దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఎన్టీఆర్ జనరంజక పాలన దేశమంతటా అనుసరణీయమైందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్దారు. ఎన్టీఆర్ ను గొప్ప ప్రజాస్వామికవాదిగా, లౌకకవాదిగా, ఆదర్శ పాలకుడిగా, పేదల పెన్నిధిగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ ఆశీర్వాదాలతో రాజకీయాల్లోకి వచ్చినవారు ఇప్పుడు విభిన్న పార్టీల్లో రాణిస్తూ ఉండటం ఆయన ప్రారంభించిన కొత్త ఒరవడికి ప్రజలు వేసిన ఆమోద ముద్ర అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎన్టీఆర్‌తో ఆత్మీయ అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పుట్టిన రోజులు జరుపుకుంటూనే ఉంటారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.











