ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్విటర్‌ని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ బ్లాక్ చేశారు. సత్యకుమార్ యాదవ్ వేసిన ట్వీట్‌పై ఆగ్రహించిన కేటీఆర్.. వెంటనే ఆయనని అన్ ఫాలో చేయడమే కాకుండా బ్లాక్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలేమైందంటే.. కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటనలో ఉండగా.. మీడియాతో చిట్ చాట్ చేస్తూ వారి సంగతి వారు చూసుకోకుండా ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిన వ్యక్తి కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆయన ఎందుకు ఓడిపోయాడో తనకే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అలాగే ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఎందుకు ఓడిపోయారో.. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు కదా అని కేటీఆర్ అన్నారు. దీంతో ధర్మవరం ఎమ్మెల్యే, ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ కేటీఆర్ కు దీటైన కౌంటర్ ట్విటర్ ద్వారా ఇచ్చారు. ఓడిపోయినోళ్లు ఓడిపోవడం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే.
ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విటర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’’ అని సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. దీంతో ఆ సెటైర్లు కేటీఆర్ కు ఎక్కడో తగిలినట్లున్నాయని.. అందుకే సత్యకుమార్ ను ట్విటర్ లో బ్లాక్ చేసి ఉంటారని అంటున్నారు