గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. పోలింగ్ స్టార్ట్ అయిన 2 గంటలకు కూడా ఇంకా పోలింగ్ మందకోడిగానే సాగుతోంది. రెండు గంటల్లో కేవలం 4.2 శాతమే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ సారి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రణాళికలు రచించారు. గత రెండు ఎన్నికల్లోనూ 46 శాతం ఓటింగ్ దాటిన దాఖలాలు లేవు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించడంలో ముందుండే గ్రేటర్ వాసులు ఓటు వేయడంలో మాత్రం వెనుకనే ఉంటున్నారు. అయితే ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఎన్నికల సంఘం చేపట్టింది.
ఓవైపు కరోనా కేసులు నమోదవుతున్నా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే 7వేలు ఉండే పోలింగ్ బూతుల సంఖ్యను ఈ సారి దాదాపు 9వేలకు పైగా పెంచారు. అయినా కానీ ఓటు వేయడానికి గ్రేటర్ జనం ఇంకా ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి కొన్ని పోలింగ్ బూతు ప్రాంతాల్లో ఉంది. మందకోడిగానే పోలింగ్ జరుగుతోంది. తమ భవిష్యత్తుతో పాటు నగర భవిష్యత్తును ఎవరికి అప్పగించాలో నిర్ణయించే నగర ఓటరు ఈ ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారనే వాదన వినబడుతోంది. ప్రతి సారి ఓటింగ్ సమయాల్లో సెలవులు రావడం.. వాటిని ఓటింగ్‌కు ఉపయోగించకుండా టూర్లకు వెళ్తున్నారనే విమర్శకూడా ఉంది. విద్యావంతులు, ఉద్యోగులు ఉండే హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ఓటింగ్ శాతం 50 శాతానికి కూడా దాటడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2009 జరిగిన ఎన్నికల్లో 42.92 శాతం ఓటింగ్ జరిగితే 2016 లో జరిగిన ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ సారి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదనే ఆరోపణ ఉంది.
74లక్షల్లో 33 లక్షలు మందే…
ఈ సారి గ్రేటర్‌లో ఉన్న ఓటర్లు 74,67,256 మంది. అయితే ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా మొత్తం ఉన్న ఓట్లల్లో సగం ఓట్లు కూడా పోల్ కావడంలేదు. 2009 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం ఓటర్లు 56 లక్షల 99వేల 15 మంది ఉంటే అందులో కేవలం 24 లక్షల 8 వేల ఒకరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే అప్పుడు నమోదైన పోలింగ్ శాతం కేవలం 42.92 శాతం మాత్రమే. ఇక 20016లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 74 లక్షల 23వేల 980 మంది ఓటర్లు ఉంటే అందులో పోలైన ఓట్లు కేవలం 33 లక్షల 60 వేల 543 మాత్రమే. నమోదైన పోలింగ్ 45.27శాతం మాత్రమే. అంటే మొత్తం ఓట్లల్లో సగం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించడంలో విఫలమవుతున్నారు. అది కావాలి.. ఇది కావాలి.. అది లేదు.. ఇది లేదు.. అవినీతి ఇందులో జరిగింది… అందులో జరిగిందని ప్రశ్నించే గ్రేటర్ ఓటరు ఎందుకు తన పంథా మార్చుకోవడంలేదు. ఓటు వేయడానికి ఇంటి నుంచి కాలు బయటికి ఎందుకు మోపడంలేదు. 2016 ఎన్నికల్లో అతితక్కువగా విజయ్‌నగర్ కాలనీలో 33.98శాతం ఓటింగ్ నమోదైతే అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 67.40 శాతం నమోదైంది.
ఊళ్లకు చెక్కేస్తున్నారు…
హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసించేవారు సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఓటర్లుగా ఉన్న ఇలాంటి వారు పోలింగ్‌కు వచ్చే సెలవు రోజును ఇతర అవసరాలకు వాడుకుందామన్న ఆలోచనతోటే ఓటింగ్ శాతం పెరగడంలేదని తెలుస్తోంది. వ్యాపారస్తులు, ధనికులు అయితే క్యూలైన్లో ఓటేయడానికి అంతగా సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కు ఓటు మారడం ద్వారా కూడా అలాంటి వారు ఓటు వేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇళ్లు మారేవారు సైతం తమ ఓటు ఉన్న పాత ప్రాంతానికి వెళ్లి ఓటు వేయడానికి ఇష్టపడకపోవడంతో అది ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతోంది. దీంతో పాటు ఈ సారి కరోనా మహమ్మారీ వ్యాప్తి ఉండడంతో ఓటింగ్ శాతం పెరుగుతుందో లేదో చూడాలి మరి.
Also Read: డిసెంబర్‌లో 10 కోట్ల కరోనా డోసులు పంపిణీ!