నగర ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులకు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు టార్గెట్ ఫిక్స్ చేశారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో… ఎలా చేస్తారో తనకు తెలియదని, సగంపైన స్థానాలు టీఆర్ఎస్ సొంతం కావాలని గట్టిగా హెచ్చరించారు.
మంగళవారం నాడు ప్రగతి భవన్ లో నగర నాయకులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అందరితోనూ బహిరంగ సమావేశం నిర్వహించిన సూచనలు, సలహాలు ఇచ్చారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు నిర్వహించారు. ఆ తర్వాత కార్పొరేటర్లను, ఇతర చిన్న చిన్న నాయకులను సమావేశ మందిరం నుంచి వెలుపలికి పంపించి వేశారు.
అనంతరం నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సీహెచ్.మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు నగరంలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాస్త కఠినంగా మాట్లాడిన కేటీఆర్ సమావేశంలో పాల్గొన్న అందరికి టార్గెట్ లు ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
గెలవకపోతే మీ పదవులకు ఎసరే..
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించాల్సిందేనని, మీమీ నియోజకవర్గాల పరిధిలో విజయం సాధించే బాధ్యత మీదేనని మంత్రులు, నాయకులకు తెగేసి చెప్పినట్లు సమాచారం. “మీ పరిధిలో మీరు విజయం సాధించాల్పిందే. అలా కాని పక్షంలో పార్టీ మరొకరిని చూసుకుంటుంది. పార్టీలో పని చేసే వారు చాలా మందే ఉన్నారు. మేం తప్ప దిక్కులేదు అని భావిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు “ అని మంత్రి కే.తారక రామారావు సీరియస్ గానే స్పందించినట్లు చెబుతున్నారు.
పార్టీకి సంబంధించిన అందరి వివరాలు తన దగ్గర ఉన్నాయని, ఎవరిని ఎలా పైకి తీసుకురావాలో తనకు తెలుసునని కేటీఆర్ అన్నట్లు సమాచారం. అలాగే పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారికి పదవులు ఇచ్చి గౌరవించడం కూడా పార్టీకి తెలుసని కేటీఆర్ అన్నట్లు చెబుతున్నారు.
సెటిలర్లతో జాగ్రత్త..
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నగరంలో సెటిల్ అయిన వారి ఓట్లు చెల్లా చెదురు కాకుండా చూడాల్పిన బాధ్యత స్థానిక నాయకత్వానిదేనని మంత్రి కేటీఆర్ సూచించినట్లు చెబుతున్నారు. “గత ఎన్నికలలో సెటిలర్లు తెలంగాణా రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చారు. పార్టీ కూడా సెటిలర్లకు సీట్లు ఇచ్చింది. ఈసారి కూడా సెటిలర్లకు చాలా సీట్లు కేటాయిస్తాం. వారిని గెలిపించుకునే బాధ్యత మీ మీదే ఉంది “ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా మొత్తం అన్ని వార్డుల్లోనూ తిరుగుతూ అభ్యర్ధుల విజయం సాధించేందుకు కృషి చేయాలని కేటీఆర్ సూచించినట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నగరంపై పట్టు సాధించిన వారవుతామని, ఇతర పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని తెలంగాణా రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.











