మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నరసరావుపేట ఎంపీ, లోక్‌సభలో టీడీపీపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతిభధ్రతలకు విఘాతం కలిగించి, వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ ఓ ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ అభివర్ణించారు. శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాకు లావు లేఖ రాశారు. లేని భద్రతా సమస్యను సృష్టించి జగన్ డ్రామాకు తెరలేపారని లేఖలో పేర్కొన్నారు. తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురదజల్లడం జగన్ నైజమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలపై అవసరమైతే తగిన విచారణ జరిపించాలని అమిత్‌షాను కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, చట్టబద్ధపాలనను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు Z+ కేటగిరీలో ఉన్న జగన్‌కు..జిల్లా పర్యటనల సందర్భంగా వందలాది మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు, రోప్ పార్టీలను ఏర్పాటు చేస్తోందన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించి సీబీఐ 11 ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారని గుర్తుచేశారు. మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ 9 కేసుల్లో అభియోగాలు నమోదు చేసిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. స్వప్రయోజనాల కోసం కుట్రలు చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
2019 ఎన్నికలకు ముందు జరిగిన జగన్ బాబాయి వివేకా ఘోర హత్యను రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. సాక్షి టీవీలో మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రసారం చేశారని, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు..జగన్ ఆ నేరాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై నెట్టేసి, రాజకీయ ప్రయోజనం పొందారన్నారు. అప్పట్లో సీబీఐ దర్యాప్తు కోరిన ఆయన చివరకు సీబీఐపైనే కేసు పెట్టారన్నారు. వివేకా హత్యలో జగన్ డ్రామా నేర రాజకీయాలకు మచ్చుతునక అన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. అది ఒకటే కాదు..విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి డ్రామా, 2024 ఎన్నికలకు ముందు రాళ్లదాడి డ్రామాను జగన్ రక్తి కట్టించారన్నారు.
జగన్‌కు ప్రజాస్వామ్యం, చట్టం, కోర్టులు అంటే ఎప్పుడూ గౌరవం లేదన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు పోలీసుల్ని వాడుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయాక అదే పోలీసులపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. ఆయన కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దెవా చేశారు. కనీసం ప్రజా తీర్పును గౌరవించే ఉద్దేశం జగన్‌కు లేదని..ఇప్పుడు ఏకంగా శవ రాజకీయాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందని..జగన్ రాజకీయ పర్యటనలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదని స్పష్టం చేశారు. చట్టపరంగా అన్ని అనుమతులూ ఇస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఒక ప్రభుత్వం నుంచి విపక్ష నేతకు ఇలాంటి సహకారం అందడం గతంలో చాలాచాలా అరుదన్న విషయం ప్రజలకు బాగానే తెలుసన్న లావు…ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ ఉదయం 11.04 గంటలకు హెలికాప్టర్‌లో దిగారని…పోలీసులు ఆయన కాన్వాయ్‌కు ఎస్కార్ట్ ఇచ్చారని గుర్తు చేశారు లావు. 12.42 గంటలకు విండ్ షీల్డ్ దెబ్బతిందంటూ వైసీపీ వాళ్లు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు. 12.56 గంటలకు ఆశ్చర్యకరంగా అదే హెలికాప్టర్ టేకాఫ్ అయిందని..నిజంగా సమస్య ఉంటే టేకాఫ్ ఎలా అయిందని ప్రశ్నించారు. దీన్నిబట్టే జగన్ డ్రామాను అర్థం చేసుకోవచ్చంటూ అమిత్ షాకు లేఖ రాశారు.
పోలీసులకు బెదిరింపులు –
2024 జూన్ నుంచి వైసీపీ నేతలు పోలీసు అధికారుల్ని బెదిరించడం, ప్రజల్ని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు లావు. 2025 జనవరి 13న డీఎస్పీ మురళీ నాయక్‌ను బెదిరించారని. 2024 నవంబరు7న డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల్ని బహిరంగంగా హెచ్చరించారని గుర్తు చేశారు. 2024 జులై 22న అసెంబ్లీ గేటు వద్ద పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నరు. మార్చి 25న..అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడైన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తకు.. పార్టీ అధికారంలోకి వచ్చాక సీఐ, డీఎస్పీలతో సెల్యూట్ చేయిస్తానని జగన్ వాగ్దానం చేశారని చెప్పారు. ఏప్రిల్ 8న పోలీసుల్ని బట్టలూడదీసి నిలబెడతానని జగన్ బెదిరించారని లేఖలో రాసుకొచ్చారు.
పాపిరెడ్డిపల్లి డ్రామాతో జగన్ మరో రాజకీయ కుట్రకు తెరతీశారన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. తిరుగు ప్రయాణంలో రోడ్డుమార్గంలో బెంగళూరు వెళతానని పార్టీ శ్రేణులకు ముందే తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగానే కేడర్ హెలికాప్టర్‌ను చుట్టుముట్టేలా చేసి..భద్రతా వైఫల్యం అంటూ గగ్గోలు పెట్టారని ఆరోపించారు. హెలికాప్టర్ దెబ్బతినడం వల్లే రోడ్డు మార్గంలో వెళుతున్నానని తప్పుడు ప్రచారం చేశారన్నారు. రాష్ట్రంలో బిహార్ కంటే దారుణమైన హింసాత్మక పరిస్థితులున్నాయని, ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని.NDA పాలనలో ఉన్న బిహార్ ప్రతిష్ఠనూ ఆయన దెబ్బతీశారని మండిపడ్డారు. పోలీసులు వాచ్‌మెన్‌ల్లా వ్యవహరిస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని చులకన చేసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే పోలీసుల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తామని హెచ్చరించడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.