కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ పరిపాలన, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యాలు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు భజన చేయడం అనేది… ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మోడీ గుడ్ లుక్స్ లో పడడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరును దేశంలోని అనేక మంది నాయకులు చీదరించుకుంటున్నారు. నిజానికి తనకు ఏమాత్రం సంబంధంలేని వ్యవహారంలో, వేలు పెట్టి, దారినపోయే కంపను నెత్తిన వేసుకున్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి దేశంలో ఇతర నాయకులు అసహ్యించుకునే పరిస్థితిని తనంత తానే సృష్టించుకున్నారని ఆయన పార్టీలోనే వారే తమలో తాము అనుకుంటున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..
ప్రధాని నరేంద్రమోడీ.. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. మోడీ గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కోవిడ్ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఇదంతా పూర్తయిన తర్వాత.. ప్రధాని ఉపదేశాలతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులో మాట మాత్రమే చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని సోరేన్ ట్వీట్ చేశారు. హిందీలో ఆయన చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఒక ప్రధాని నిర్వహించిన సమావేశం గురించి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వెటకారం.. సహజంగానే తీవ్రమైన అంశంగా అందరూ మాట్లాడుకున్నారు.
నిజానికి ఈ వ్యవహారంతో, సోరెన్ ట్వీట్ తో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. కానీ మధ్యలో తాను జోక్యం చేసుకున్నారు. ప్రధాని మోడీ ప్రసన్నం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా ఆయన భావించారు. సోరెన్ ట్వీట్ ను ఖండిస్తే.. తాను ప్రధాని గుడ్ లుక్స్ లో పడగలనని ఆశపడ్డారు. ఫలితంగా..
Dear @HemantSorenJMM,
I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation.
In this war against Covid-19, these are the times not to point fingers but to come together and strengthen the hands of our Prime Minister to effectively combat the pandemic.
అని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. రాజకీయాలు చేయడం తగని పని. అది మన జాతిని బలహీన పరుస్తుందని ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ హేమంత్ సోరెన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘మనం కొవిడ్ పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే సందర్భం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయిచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’’ అని కూడా తోటి ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.
జగన్‌కు కావలిస్తే నేరుగా ప్రధాని మోడీ భజన చేసుకుని ఉంటే సరిపోయేది. మోడీ అనితర సాధ్యమైన రీతిలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పాటుపడుతున్నారని కితాబులు ఇచ్చుకుంటే సరిపోయేది.. జనం నవ్వుకుని వదిలేసేవారు. అందులోని భజన స్పష్టంగా కనిపిస్తుంది గనుక.. జగన్ ఆ పనిచేయకుండా.. సోరెన్ ట్వీట్ ను ఆక్షేపించారు. అయితే ఇది ఇంకా మోడీకి జగన్ చేస్తున్న వీర భజన గా గుర్తింపు తెచ్చుకుంది. బీజేపీ నాయకులకు ఇది పండగగా కనిపించవచ్చు గానీ.. దేశంలోని బీజేపీయేతర నాయకులందరూ కూడీ జగన్ వైఖరిని చీదరించుకుంటున్నారు.
దేశంలో కోవిడ్ నివారణలో మోడీ సర్కారు దారుణంగా విఫలమైందిన ప్రపంచంలోని మేధావులు చాలా మంది అంటున్నారు. దేశంలోని మేధావులు.. కేంద్రం వైఫల్యాల్ని ఏ రకంగా ఎండగడుతున్నారో లెక్కేలేదు. మరోవైపు మోడీ ధర్మోపదేశాలతో కాలం గడుపుతున్నారనే అపప్రధలు కూడా ఉన్నాయి. ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతుండగా.. జగన్ మాత్రం.. ఆయనకు వీరభజన చేయడం.. సర్వత్రా విమర్శలకు గురవుతోంది.
ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా జగన్‌కు చాలా ఘాటుగానే ట్విటర్ లో కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడివై ఉండి కూడా సీబీఐ, ఈడీ దాడులకు భయపడి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీతో ఇలా లాలూచీ పడడం బాగాలేదు. మీరు ఎదగాలి జగన్. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి’’ అని ఉలాకా నిశిత విమర్శలు కురిపించారు.
జగన్ చేస్తున్న మోడీ భజన, ఆయన మీద వస్తున్న విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎంపీ ఉలాకా చెప్పినట్లు ఆయన ఎదగాలని అంతా అనుకుంటున్నారు. ఇంతకూ తాను ముఖ్యమంత్రిని అనే సంగతి జగన్ కు గుర్తున్నదో, లేదా ఇంకా మోడీ ప్రాపకం కోసం దేబిరించే వ్యక్తిగా తనగురించి తాను అనుకుంటున్నారో.. కూడా ఆయనకు స్పష్టత రావాలి.
అందరూ అసహ్యించుకునే వాళ్లే
ఒక్క ఒడిశా ఎంపీ సప్తగిరి ఉలాకా మాత్రమే కాదు.. దేశంలో అనేక మంది నాయకులు కూడా జగన్ ట్వీట్ ను అసహ్యించుకుంటున్నారు. ‘ఇక జగన్ ఎప్పటికీ జైలు వెళ్లడం ఉండదు’ అంటూ ఆయన ట్వీట్ ను ఉద్దేశించి మోహన్ కుమార మంగళం వెటకారం చేశారు.
నాగేంద్ర శర్మ తన ట్విటర్ లో ఇంకోరకంగా జగన్ ను విమర్శించారు. ‘‘ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఏపీ దురదృష్టం. అనేక కేసుల్లో బెయిలుపై ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు. ప్రధాని కార్యాలయం/ బీజేపీ నుంచి వస్తున్న మెసేజీలను ఆయన తన ట్విటర్ ఖాతాలో కాపీ పేస్ట్ చేస్తున్నట్లుంది’’ అని హేళన చేశారు. జగన్ ట్వీట్ దేశమంతా విపరీతంగా ట్రోల్ అవుతోంది.