నాగార్జున ఘోస్ట్ బాక్సీఫీసు వద్ద బోల్తా పడింది. తాజాగా ఇదే పేరుతో ఓ పాన్ ఇండియా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరో మరెవరో కాదు డాక్టర్ శివరాజ్ కుమార్. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి నాగ్ ఘోస్ట్ కీ, ఈ ఘోస్ట్ కీ కథా పరంగా ఎలాంటి సంబంధమూలేదు.
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కన్నడ చిత్రాల హవా పెరిగింది. రిషబ్ షెట్టి కాంతారా ప్రభంజనం చూశాక కన్నడ చిత్రాలను తక్కువ అంచనా లేమని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఈ ఘోస్ట్ కోసం ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో జైల్ సెట్ వేశారు. అందులోనే ఇప్పుడు చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడ 24 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు.
నవంబర్ 10 కల్లా మొదటి షెడ్యుల్ పూర్తవుతుంది. డిసెంబరు లో రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అతిరథ మహారథులంతా దీనికి పనిచేస్తున్నారు. కెజిఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి సెట్స్ వేశారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. తెలుగులో సినిమా ప్రచార బాధ్యతలను బీఏ రాజు టీమ్ చేపట్టింది. నిర్మాణ సంస్థ సందేశ్ ప్రొడక్షన్స్ కు ఇది 29వ చిత్రమవుతుంది.











