ఆయన పాటలో నవరసాల్లో ఏ రసం లేదని అనగలం. మనం ఏడుస్తున్నపుడు ఆయనది అలాంటి పాటే రేడియోలో వస్తుంది.. మనకు కళమ్మట నీళ్లు ఆగవు.. మనం నవ్వుతూ సరదాగా ఉన్నప్పుడు ‘మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం’ అంటూ వినిపిస్తుంది.. నవ్వు ఆగదు. మనం విషాదంలో మునిగి తేలుతున్నప్పుడు ‘ఆగదు ఏ నిముషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకమూ..’ అంటూ కరుణ రసం ఉప్పొంగగానే మనంలోంచి దు:ఖం పొర్లుకొస్తుంది.
‘శంకరా నాద శరీరా పరా.. ’ అంటూ ఆయన స్వరధుని మొదలైతే.. మనల్ని మనమే మైమరచిపోతాం. ఆ అధరామృతాన్ని మనసారా గ్రోలతాం.. ఆ గంధర్వ గానానికి పరవశించిపోతాం.
అందుకేనేమో ఆయనకు గాన గంధర్వుడు అనే పేరు కూడా వచ్చింది. ఆయన ఒక్కోపాటా ఒక్కో ఆణిముత్యం.. ఎన్నన్ని చెప్పాలి.. ఏమని చెప్పాలి. అందులో కోటి రాగాలు, శతకోటి స్వరాలు.. అనంతకోటి తాళాలు.. ఆ పల్లవులను మన మదిని తాకుతాయి.. ఆ చరణాలు మన హృదిని దోచేస్తాయి. తెలుగు సినిమాకి ఘంటసాల ఓ కన్ను అయితే, బాలు మరో కన్ను. ఆ స్వరం అనేక రూపాలతో సరాగాలాడుతుంది. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’ పాటను ఘంటసాలతో కలిసి పాడుతుంటే ఎవరి స్వరం ఏదో మనం పోల్చుకోవడం కూడా కష్టమే. అది శంకరాభరణం రాగం కావచ్చు.. సిరిసిరి మువ్వల తానం కావచ్చు.. ఆశ్రుతిలయలు ఎక్కడా తప్పవు. ఆయన పాటలకు నటన తోడై ఎందరో అగ్ర తారలుగా తారాపథానికి చేరిపోయారు.
‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో ఎన్టీఆర్ కు ఘంటసాల స్వరం అందిస్తే, కృష్ణకు బాలు పాడారు. ఆయన ఎవరికి పాడినా ఆ హీరోనే పాడినట్లు అనిపించడమే ఆయన స్వరంలోని విశేషం. ‘ఆకుచాటు పిందె తడిసే.. ’ అంటూ ఎన్టీఆర్ కు పాడితే తారక రాముడే పాడుతున్నాడా అనిపిస్తుంది. ఇళయరాజా స్వరకల్పనలో బాలుకు ఎన్నెన్ని హిట్లు వచ్చాయో చెప్పలేం, మామ కేవీ మహదేవన్ పాటల్లోని అందాలను వర్ణించడానికి మాటలు చాలవు. ‘మామా .. చంద మామా…’ అంటూ బాలూని అనుకరిస్తూ, చరణం దాకా రాకుండానే పల్లవి ఆలాపనతోనే బహుమతులు కొట్టేసేవారెందో ఉన్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా ఇంత ప్రతిభ ఎక్కెడినుంచి వచ్చిందని ఆశ్చర్యపోయేవారు ఎందరో ఉన్నారు.
‘గీతాంజలి’లోని ‘ఆమనీ పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళా…’ఏమనిపిస్తుందో ఊహించుకోండి. ‘పరిమళించు వెన్నెల నీవే..’ పాట తెలుసా? ఈ ‘సాకీ’ తర్వాత వచ్చే పల్లవే అందరూ గుర్తు పడతారు. అది – ‘కనుల ముందు నీవుంటే కవిత పొంగిపారదా? ’కేవీ మహదేవన్ సంగీతం రూపొందిన ఈ పాటలో బాలు గొంతు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా…’ పాటలో బాలూ స్వరాన్ని, అదే సినిమాలో ‘అలివేణీ… ఆణిముత్యమా..’ పాటలో టీనేజ్ యువకుడి గొంతు వైవిధ్యం ఒక్క బాలూకే సొంతం.
‘బలిపీఠం’లో దేవులపల్లి గీతం ‘కుశలమా.. కుశలమా నీకు కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేకా ఎదో ఎదో రాశానూ అంతే అంతే అంతే .. ’ వింటే మనకే తెలియని ఆనంద డోలికల్లో తేలిపోతాం. ఆయన పాటల పూదోటలో మనమంతా మకరందాలమే. ఇక ఈ పాటల తోటలో స్వరాలతో చెట్టాపట్టాలేసుకొని మనం విహరించామంటే బయటకు రాలేం. బాలూ ఎప్పటికే మనలోనే ఉంటారు.. మనతోనే ఉంటారు. ఆయన గొంతు ఇక పల్లవించక పోవచ్చు.. ఆ గొంతు నుంచి చరణాలు రాకపోవచ్చు.. కానీ బాలూ స్మరణలోనే ఆయన భక్తులుంటారు. అలాంటి బాలూకు స్వరనీరాజనంతో అంజలి ఘటించాల్సిందే.











