దుబ్బాకలో జరుగుతున్న ఎమ్మెల్యే ఉప ఎన్నికలో బీజేపీ కూడా గట్టిగా పోరాడుతోంది. తెరాస సిటింగ్ స్థానాన్ని కైవశం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయావకాశాల్ని మెరుగుపరచడానికి వారి తరఫున ప్రచారానికి పవన్ కల్యాణ్ కూడా రాబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి తాజాగా .. ఇలాంటి ప్రచారాన్ని కొట్టి పారేశారు.
పవన్ కల్యాణ్ దుబ్బాక ప్రచారానికి వెళ్లనున్నట్టు పుకార్లు మొదలయ్యాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తులు ఉన్న ఈ రెండు పార్టీల మధ్య డీల్ కు నాందిగా దుబ్బాక ప్రచారం ఉంటుందనే వాదన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ప్రచారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ వెళ్లబోరంటూ దిలియోన్యూస్ డాట్ కామ్ ఒక ప్రత్యేక కథనాన్ని కూడా అందించింది. ఎందుకు వెళ్లరో కారణాల్ని కూడా విశ్లేషించింది. (ఇది కూడా చదవండి : దుబ్బాకకు పవన్ వెళ్లేది లేదు) అయితే ఇలాంటి అన్ని రకాల ప్రచారాలకు కిషన్ రెడ్డి ఒకటే మాటతో ఫుల్ స్టాప్ పెట్టేశారు.
హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ గా అనేక విషయాలను వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు తెరాస సర్కారు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభమని అభివర్ణించారు. ఇళ్ళు వచ్చిన వారికి ఆనందం కంటే రాని వారికే ఎక్కువ కడుపు మంట అని, అది తమకు లాభిస్తుందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.
మంత్రి హరీష్ రావు లోని ఫ్రస్టేషన్ గమనిస్తే దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందని అర్థమవుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదని కిషన్ రెడ్డి చెప్పారు. దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే విషయంలో కూడా స్పష్టత లేదని తేల్చేశారు. నాయకులే విరాళాలు ఇవ్వాలన్న పవన్ మాటల్ని కిషన్ రెడ్డి సమర్థించారు. విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని అడిగనందునే .. నాయకులు సైతం విరాళాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి కిషన్ రెడ్డి మాటలతో.. పవన్ ప్రచారానికి దుబ్బాక వెళ్లడం లేదని తేలిపోయినట్టే అని పలువురు భావిస్తున్నారు.