ఇరవై.. ముప్పై.. నలభై.. ఎనభై.. వంద.. లక్షలు కాదండీ బాబూ అక్షరాలా కోట్లే. అది కొల్లగొడుతున్నదీ మన హీరోలే. అదీ మన హీరోలకున్న డిమాండ్.. ఇచ్చేవారున్నపుడు పుచ్చుకోవడం తప్పెలా అవుతుందన్నది కొందరి ప్రశ్న.
సినిమా రంగంలో నంబర్ల గేమ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఏ హీరో ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిమీద స్పష్టత లేదు. ఈ పారితోషికాల విషయంలో నలుపు తెలుపులు ఉంటాయి కాబట్టి అంచనా వేయడం కూడా కష్టమే. అందుకే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టి ఎక్కువగా సినిమా వారి మీదే ఉంటుంది. ఎవరి పారితోషికం ఎంత అని తెలుసుకునే ముందు ఈ మధ్య సినిమా రంగం ఓ నిర్ణయం తీసుకుంది. ముందు దాని గురించి తెలుసుకుందాం. కరోనా వచ్చాక సినిమా రంగం సంక్షోభానికి గురైంది.
అందువల్ల నటులంతా తమ పారితోషికాల్లో 20 శాతం తగ్గించాల్సిందేనని పరిశ్రమ తరఫున ఓ తీర్మానం చేశారు. నిజానికి ఇది ఎంతవరకు అమలుతుందన్నది ప్రశ్నార్థకమే. దాదాపు రూ. 5 లక్షలకు మించి పారితోషికం తీసుకునే ప్రతి ఒక్కరూ తమ పారితోషికాల్లో కోత విధించుకోవాలని సూచించారు. రోజుకు రూ. 20 వేల లోపు తీసుకుంటే మాత్రం ఇది వర్తించదు. కానీ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం పారితోషికాలు తగ్గించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
తగ్గింపు ఎందుకు సాధ్యం కాదు?
రెమ్యూనరేషన్ అనేది ఎవరి చేతుల్లోనూ లేని అంశం. అది డిమాండ్ అండ్ సప్లయిల మీద ఆధారపడి ఉండటమే అందుకు కారణం. ఫలానా హీరోయే తమకు కావాలని నిర్మాతలు తపస్సు చేస్తుంటారు. యాభై కోట్లు ఇస్తామని నలుగురు నిర్మాతలు ఎగబడుతున్నపుడు హీరో రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గిస్తాడు? తగ్గించాల్సిన అవసరం అతనికేంటి? చాలామంది ఇదే అభిప్రాయపడుతున్నారు. అది జరిగే పని కాదని కూడా అంటున్నారు. నాని లాంటి హీరో సినిమా చేస్తానంటే పది కోట్లు పట్టుకెళ్లి అడ్వాన్స్ ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు పారితోషికాలు తగ్గించుకోవలసి ఉంటుందని అభిప్రాయపడిన నానీ కూడా తగ్గించుకోడానికి వెనకాముందు ఆడవచ్చు.
నానీకి బిజినెస్ ఉంది కాబట్టే ఈ పరిస్థితి. ఇచ్చేవారు ఉన్నపుడు రెమ్యూనరేషన్ తగ్గించమని అడగటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. కాకపోతే మంచిమనసుతో వాళ్లు ‘ఏవండీ వ్యాపార పరిస్థితి బాగోలేదు.. జనం ఇదివరకటిలా థియేటర్లకు రావచ్చు రాకపోవచ్చు’ అని 20 శాతమో 30 శాతమో తగ్గించడానికి అవకాశం ఉంది. మలయాళంలో మోహన్ లాల్ 25 శాతం తగ్గించారు. అలాగే ఇద్దరు ముగ్గురు కన్నడ హీరోలు కూడా తగ్గించారు. దర్శకుడు కోడి రామకృష్ణకు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కోటి రూపాయలు తీసుకోవలసి వచ్చినా రూ. 40 లక్షలు, 50 లక్షలకు కూడా సినిమా చేసేవారంటారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా అలాంటి అవకాశమే ఇచ్చేవారు. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిపి సినిమా చేసుకోమని అనేవారు. ఆయన చివరిసారిగా ‘నాదేశం’ సినిమా అవకాశం అలానే ఇచ్చారు.
ఎవరెవరి పారితోషికాలు ఎంతెంత?
ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. మన హీరోల పారితోషికాలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతుంటాయి. టాప్ హీరోలు రెమ్యూనరేషన్లు కోట్లలో ఉన్నాయి. ఒకసారి టాప్ హీరో క్రేజ్ వచ్చిందంటే సినిమా జయాపజయాలతో పనిలేదు. పైగా ఇప్పుడు పాన్ ఇండియా కలరింగ్ ఒకటి. పరిధి పెరిగేసరికి ఈ పారితోషికం వంద కోట్లకు పెరిగిపోతోంది. ఈ విషయంలో అగ్రతాంబూలం ప్రభాస్ కే దక్కుతుంది. ‘బాహుబలి’తో వచ్చిన క్రేజ్ తోనే ‘సాహో’తో వంద కోట్ల పారితోషికానికి ఆయన ఎదిగిపోయాడు. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే సినిమాకి రూ. 100 కోట్లు తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల సమాచారం.
ఈ విషయంలో ప్రిన్స్ మహేశ్ బాబు కూడా ఎక్కడా తగ్గడం లేదట. దానికి కారణం ఆయన గత ఏడాది చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ 200 కోట్లు వసూలు చేయడమే. దాంతో ఆయన పారితోషికాన్ని రూ. 40 కోట్ల నుంచి 80 కోట్లకు పెంచేసినట్లు తెలుస్తోంది. పైగా మహేశ్ కాల్ షీట్ల కోసం నిర్మాతలు క్యూకడుతున్నారు. ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. ‘వకీల్ సాబ్’ కోసం ఆయన దాదాపు రూ. 50 కోట్లు తీసుకున్నారని వినికిడి. అంతకుముందు ఆయన ‘అజ్ఞాత వాసి’ పెద్దగా ఫలితం చూపకపోయినా పవన్ కు పెద్ద మొత్తాలు ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. ఇక ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది.
ఎందుకంటే అల్లు అర్జున్ సినిమాలకు ఇతర రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా కేరళలో ఆయనకు అభిమానులు ఎక్కువ. పైగా గత ఏడాది ‘అలవైకుంఠపురములో’ అనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన వసూళ్లు ఓ పక్కన కనిపిస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాకు దాదాపు 40 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అగ్ర హీరోల విషయానికి వస్తే ఇక మిగిలింది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ఇద్దరూ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వీరు తీసుకుంటున్న పారితోషికం ఎంత అనే విషయంలోనూ క్యూరియాసిటీ నెలకొంది.
ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ, రామ్ చరణ్ రంగస్థలం చిత్రాలు కూడా మంచి వసూళ్లే రాబట్టాయి. ఈ ఇద్దరికీ సమాన పారితోషికం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా దాదాపు 35 కోట్ల వరకూ ఉండొచ్చనేది సమాచారం. ఇలాంటప్పుడు వీరి పారితోషికాల్లో కోత విధించాల్సి వస్తే భారీగానే ఉంటుంది. ప్రభాస్ తీసుకునే 100 కోట్లలో 20 కోట్లు ఎగిరిపోతాయి. ఇంతమొత్తాలు విరాళాలుగా తీసుకుంటున్నప్పుడు సేవాకార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చించవచ్చు. సాధారణంగా ఎవరైనా తమ ఆదాయంలో పదో వంతు దానం చేస్తే మంచిదంటారు. కాకపోతే మనవారు మాత్రం ఒకటి రెండు శాతం దానానికే పరిమితమవుతున్నారు.
ఆ నలుగురి మాటేమిటి?
ఈ మెగా హీరోలను ప్రత్యేకంగా పేర్కొనాల్సి రావడంతో వీరి గురించి వేరుగా ప్రస్తావించాల్సి వస్తోంది. తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం సీనియర్ హీరోలు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. వీరిని యూత్ హీరోల సరసన చేర్చలేం. పారితోషికాల మాట ఎత్తాల్సి వస్తే ఇక్కడ అగ్రతాంబూలం మెగాస్టార్ కే దక్కుతుంది. చిరంజీవి సినిమాలంటే నేటి కుర్రకారుకూ వెర్రెక్కిపోతుంది. దానికి కారణం ఈ వయసులోనూ ఆయన డ్యాన్సులే ప్రత్యేకంగా నిలుస్తాయి.
అందుకే ఆయన పారితోషికం నేటి అగ్ర యూత్ హీరోలకు ఏమీ తగ్గదని తెలుస్తోంది. అయితే పారితోషికాల తగ్గింపు విషయానికి వస్తే వీరిలో పట్టువిడుపులు కనిపిస్తూ ఉంటాయి. మేము ఎవరమూ ఎవరికీ పోటీ కాదు అనే ధోరణిలోనే వీరు వ్యవహరిస్తున్నారు. బహుశా అది వయసు వల్ల వచ్చిన పెద్దరికం కావచ్చు. ఆ పెద్దరికాన్ని కాపాడుకోవాలన్న తపన కూడా కావచ్చు. అదండీ మన హీరోల భారీ పారితోషికాల వెనకున్న కథాకమామీషు.
– హేమసుందర్ పామర్తి