దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్యే రామలింగారెడ్డి హఠాన్మరణంతో.. ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి తెరాస తీవ్రంగార కృషి చేస్తోంది. మంత్రి హరీశ్ రావు.. దుబ్బాకలోనే తిష్టవేసి.. అత్యధిక మెజారిటీతో విజయాన్ని నమోదు చేసి తన ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. తెరాస ఆధిపత్యానికి దెబ్బకొట్టి.. కేసీఆర్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నదని నిరూపించడానికి కాంగ్రెస్, బీజేపీ కూడా బరిలో ఉన్నాయి. తెలుగుదేశం ఈ ఎన్నికకు దూరంగా ఉంది.
ఇక పోతే.. బీజేపీతో పొత్తుకుదుర్చుకుని.. ఎన్డీయే కూటమిలో తాము కూడా భాగమే అని ప్రకటించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని… అక్కడి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతారని కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టాయి. అయితే.. కొన్ని మీడియా సంస్థలు మరో అడుగు ముందుకు వేసి.. పవన్ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రావడానికి బదులుగా.. బీజేపీ జనసేనకు ఎలాంటి మేలుచేస్తుందో.. ఆ రకంగా వారద్దరి మధ్య కుదురుతున్న డీల్ ఏమిటో కూడా కథలు కథలుగా వివరిస్తూ.. కథనాలు అందించాయి.
దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని.. దానికి పన్రతిగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్న జనసేనకు బీజేపీ కూడా సహకరిస్తుందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు డివిజన్లను పంచుకుని.. పోటీచేస్తాయని అలాంటి ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. పవన్ కల్యాణ్ తాను దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రాబోయేది లేదని బీజేపీ వారితో తేల్చిచెప్పేశారు.
ఎందుకు వెళ్లడం లేదు.?
కొవిడ్ దెబ్బకు షూటింగులు ఆగిపోయిన నాటినుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తిగా తన ఫాం హౌస్‌కే పరిమితం అయిపోయారు. అక్కడినుంచి ఆయన వెలుపలికి రావడం లేదు. పార్టీ నాయకులు, కీలక వ్యక్తులు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి కలిసి వెళుతున్నారు. ఎటూ షూటింగులు లేవు. మధ్యలో ఆయన నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్షలో కూడా ఉన్నారు. దీక్ష ముగిసిన తర్వాత కూడా ఆయన ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. ఇందుకు కొవిడ్ ఒక కారణం కావచ్చు. కొవిడ్ ప్రభావం ఇప్పటిదాకా ఏమాత్రం తగ్గని, ఏకైక పరిష్కారం అయిన వేక్సిన్ విషయంలో ఎలాంటి పురోగతి లేని ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఒక ఉపఎన్నిక- అది కూడా తెలంగాణలో- కోసం.. బయటకు వస్తారని.. గుంపులుగా ఉండే జనసమూహంలోకి వెళ్తారని అనుకోలేం.
రాజకీయ కారణమూ ఉంది..
పవన్ కల్యాణ్ దుబ్బాక ఎన్నిక ప్రచారానికి రాను అని నిర్మొగ మాటంగా చెప్పడానికి కేవలం కొవిడ్ మాత్రమే కాకుండా, రాజకీయ కారణం కూడా ఉంది. దుబ్బాక తెరాసకు సిటింగ్ సీటు. పైగా ఇప్పుడు వారికి సానుభూతి పవనాలు కూడా జత కలుస్తాయి. ఇలాంటి నేపథ్యంలో తెరాస మీద నెగ్గడం కష్టం. పైగా అక్కడ బీజేపీ పెద్ద బలంగా కూడా లేదు. తాను వెళ్లి ప్రచారం చేసినంత మాత్రాన ఎడ్వాంటేజీ వచ్చి.. గెలుస్తామనే గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్రతం చెడినా ఫలం దక్కే అవకాశం కూడా లేదని.. అనవసరంగా పరువు పోతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వస్తే.. ఎటొచ్చీ.. అప్పుడు నగర ఓటర్లను ఆకర్షించడానికి తన అవసరం బీజేపీకి కూడా ఉంటుంది గనుక.. అప్పటి పొత్తులు సంగతి అప్పటి అవసరాల మీద ఆధారపడి నిర్ణయించుకోవచ్చునని కూడా పవన్ కల్యాణ్ అంటున్నట్టు తెలుస్తోంది.











