ఏపీ ముఖ్యమంత్రి జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలకు విద్యలో అరకొరమార్కులే వస్తున్నాయనే చర్చ సాగుతోంది.. ఇటీవల ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కుల ఫలితాలలో బొత్స సొంత జిల్లా విజయనగరం పాస్ పర్సంటేజ్ లో చివర నిలవడం హాట్ టాపిక్ గా మారింది.. తాజాగా ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప సైతం అట్టడుగున ఉండడం విద్యాశాఖ వర్గాలలో చర్చకు దారితీస్తోంది..
నాడు నేడు, జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలతో విద్యావ్యవస్థను సమూలంగా మార్చివేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తోంది జగన్ సర్కార్. విద్యా వ్యవస్థపై జగన్ ఆశలు, ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి బొత్సది.. అయితే, ఫలితాలలో మాత్రం ఫలితం దీనికి పూర్తి భిన్నంగా ఉందనే చర్చ సాగుతోంది..
ఇంటర్ ఫస్టియర్లో రాష్ట్ర ఉత్తీర్ణత 61శాతం గా నమోదైంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇంటర్ విద్యా మండలి ఫలితాలు విడుదల చేసింది. 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటిస్థానంలో నిలవగా. కేవలం 46శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ కడప జిల్లా చివరన మిగిలింది. ఈ జిల్లాలో 18,839మంది పరీక్షలు రాయగా, కేవలం 8,603మంది మా త్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 10వేల మంది ఫెయిల్ అయ్యారు. ఇక ఇంటర్ రెండో సంవత్సరంలో రాష్ట్ర ఉత్తీర్ణత 72శాతం. కృష్ణాజిల్లా 83శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచింది. మంత్రి బొత్స సొంత జిల్లా విజయనగరం 57శాతంతో చివర్లో ఉంది. కడప అంతకంటే ఒక్క స్థానం ముందు 60శాతంతో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 17,056 మంది పరీక్షలు రాస్తే, 10,230 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల సొంత జిల్లాలలో విద్యా శాఖ పనితీరు ఆమోదయోగ్యంగా లేదనే చర్చ సాగుతోంది.. ఇప్పటికయినా అధికారులు బాధ్యత తీసుకొని ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. మరి, వచ్చే ఏడాదయినా జగన్, బొత్స జిల్లాలు మెరుగయిన ఫలితాలను అందుకుంటాయేమో చూడాలి.











