ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వత్రా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా లేకపోవడం.. ఆ క్రమంలో హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కు సిద్ధం కాగా ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ గురువారం సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైంది. ఇక శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఉద్యోగ సంఘాలుకూడా పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇక ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చిచేందుకు శుక్రవారం ఉదయం పది గంటలకు రావాల్సిందిగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను కోరారు. సీఎంతో సమావేశం ఉందని చెప్పిన సదరు అధికారులు మూడు గంటలకు వస్తామని చెప్పారు. అయితే మూడు గంటలకు కూడా రాకపోవడంతో SEC ఆ మీటింగ్ ను 5గంటలకు వాయిదా వేశారు. అయినా సదరు అధికారులు హాజరు కాలేదు. ఇక్కడే అన్ని కోణాల్లో చర్చ జరుగుతోంది. వ్యవస్థల మధ్య సంఘర్షణ రాజ్యాంగ సంక్షోభానికి కారణంగా మారే ప్రమాదం ఉందనే చర్చ నడుస్తోంది.
ఇలా జరిగితేనే..సంక్షోభం అనే చర్చ..
ఈ అంశంపై సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకు హైకోర్టు తీర్పే అంతిమం. అన్ని వ్యవస్థలూ ఆ తీర్పును గౌరవించాల్సిందే. కట్టుబడి ఉండాల్సిందే. పిటిషన్ లో పొందుపర్చే అఫిడవిట్ లోనే..తీర్పును గౌరవిస్తామని చెప్పాల్సి ఉంటుంది. అంటే సహేతుక (బలమైన) కారణం లేకుండా తీర్పును గౌరవించకుంటే..కోర్టు ధిక్కరణ అంశం తెరపైకి వస్తుందనే చర్చ నడుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. శనివారం నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది. ఆ ప్రకారం చూస్తే..ఎన్నికల షెడ్యూల్ , నోటిఫికేషన్ విడుదలయ్యాక.. వ్యవస్థలు అన్నీ ఎన్నికల సంఘం పరిధిలోకి రావాల్సిందే. రాజ్యాంగం ఆ స్థాయి స్వయం ప్రతిపత్తిని ఎన్నికల సంఘానికి ఇచ్చింది. అధికారులు ఎన్నికల సంఘ ఆదేశాలను పట్టించుకోలేదు. రాజ్యాంగ దిక్కరణ, కోర్టు దిక్కరణ రాజ్యాంగ సంక్షోభం అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో గవర్నర్ జోక్యంపైనా చర్చ జరుగుతోంది.
జోక్యం ఎప్పుడంటే..
రాజ్యాంగం పలు వ్యవస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఆయా వ్యవస్థల మధ్య ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు ఆయా వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి. అయితే ఏపీలో పరస్పర పోరు కొనసాగుతోంది. ఆ క్రమంలో రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక అంశాలకు విఘాతం కలుగుతుందా అనే చర్చ నడుస్తోంది. రాజ్యాంగంలోని 243 k (3) ప్రకారం పరిస్థితిని బట్టి ఎన్నికల సంఘం కోరిక మేరకు.. గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ‘ఈ తీర్పును అమలుచేసే విషయంలో అవసరమైతే గవర్నర్ జోక్యం కూడా ఉంటుందనే విధంగా గురువారం హైకోర్టు ఇచ్చిన 37పేజీల తీర్పులో కూడా ఉండడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. అంటే అటు సుప్రీంకోర్టు, ఇటు గవర్నర్ ల జోక్యం అనివార్యమైందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ని కలిసి వివరించారు. ఉద్యోగ సంఘాల నాయకులూ కలిసి ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఇక్కడే గతంలో జరిగిన కొన్ని సంఘనటలు, తీర్పులను చాలామంది తెరపైకి తెస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘానికీ అధికారాలు..
2000 లో కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ భారత ప్రభుత్వం మధ్య ఓ విషయం వచ్చిన వివాదానికి సంబంధించి కొన్ని అంశాలు తెరపైకి కొన్ని అంశాలు వచ్చాయి. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం పార్లమెంటు కూడా కొన్ని చర్యలు చేపట్టింది. ఆ మార్పుల ప్రకారం.. ఎన్నికల నిర్వహణకు అధికారులు సహకరించకుంటే… వారిపై సస్పెండ్ చేయడం..కొత్తవారిని నియమించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఉంటుంది. ఏపీ, మహారాష్ట్ర, మిజోరం, త్రిపుర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ క్రమంలో దేశంలో ఉన్న రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు తప్ప.. మిగతా విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో SECలకూ అవే అధికారాలుంటాయి. అంతేకాదు..ప్రభుత్వాలు సహకరించిన పక్షంలో డైరెక్ట్ ఎన్నికల సంఘం ఉద్యోగులకు ఆదేశాలు జారీచేసే అధికారం కూడా ఎన్నికల సంఘానికి వచ్చాయి.
ఆర్టికల్ 356పై చర్చ..
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 356 అంశంపై మరో సారి చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాకే ఓ క్లారిటీ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ ఆర్టికల్ ప్రకారం.. రాజ్యంగ వ్యవస్థలు (కాన్స్టిట్యూషన్ మెషినరీ) రాజ్యాంగాన్ని అమలుచేయడంలో విఫలం అయినప్పుడు 356 ఆర్టికల్ ప్రకారం కేంద్రం జోక్యం చేసుకునే వీలుంది. ఈ చర్చ ఎందుకు జరుగుతుందనే అంశానికి వస్తే..ఎన్నికల ప్రక్రియ ను ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వం SEC జారీచేసిన నోటిఫికేషన్ ని పట్టించుకోకుంటే..నామినేషన్ల స్వీకరణకు, పరిశీలనకు ఉద్యోగులు ఉండరు. అంటే దేశ ప్రజాస్వామ్య మూలాలను, రాజ్యంగ స్వరూపాన్ని మౌలిక అంశాలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి జనార్దన్ స్వామి వర్సెస్ మహారాష్ట్ర, కిషన్ సింగ్ థోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తదితర కేసులో న్యాయస్థానాలు పలు తీర్పులు ఇచ్చాయి. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని తీర్పులు వచ్చాయి
ఎన్నో సందేహాలు…
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరో సందేహాన్ని కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఎన్నికల సంఘంతో సమావేశానికి హాజరుకాని సదరు అధికారులపై సాధారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్రానికి లేఖలు రాస్తుంది. అవసరమైత న్యాయవ్యవస్థలకూ సమాచారం పంపుతుంది. ఈ క్రమంలో రానున్న కాలంలో సదరు అధికారులపై కూడా చర్యలు తీసుకుకునేందుకు కూడా అవకాశం ఉంది. దీంతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగడంవంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. మరోవైపు గతంలో కొవిడ్ ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసింది. ప్రభుత్వం మాత్రం ఎన్నికలు జరపాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఆటైంలో ఏం మాట్లాడని కొన్ని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు.. ఆందోళన వ్యక్తం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదేశాలే ‘సుప్రీం’..
రాజ్యాంగ సంక్షోభం అనే మాట ప్రస్తుతానికి పెద్దదే అనిపిస్తున్నా.. వ్యవస్థల మధ్య సమన్వయం లోపించినప్పుడు, ధీర్ఘకాలంపాటు వ్యవస్థల మధ్య ఘర్షణ తెలిత్తినప్పుడు, వ్యవస్థలు విఫలమైనప్పుడు, రాజ్యాంగ మౌలిక అంశాలకు విఘాతం కలిగించేలా ఉన్నప్పుడు కచ్చితంగా ఈ అంశం తెరపైకి వస్తోంది. అయితే అంతవరకు వెళ్లకుండా.. మిగతా వ్యవస్థలు కొన్ని సార్లు చక్కదిద్దే ప్రయత్నం చేస్తాయి. అది సుప్రీంకోర్టు కావచ్చు..కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఈ నేపథ్యంలో ఏపీ లో స్థానిక ఎన్నిక అంశంలో సోమవారం సుప్రీం కోర్టు ఏం చెబుతుంది..అనే అంశం కీలకంగా మారింది. అదే సమయంలో ఎన్నికలు జరపాలని ఆదేశిస్తే.. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా సహకరించినా..నైతికంగా ఎంత వరకు సహకరిస్తారనేది తేలాలి. మొత్తంమీద ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల ద్వార తరచూ మారే ప్రభుత్వాలు, వ్యవస్థల్లో భాగమైన కొందరు అధికారుల కారణంగా వ్యవస్థలు బలహీనపడడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే చర్చ నడుస్తోంది.











