నిజంగానే… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తనదైన శైలి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓ కీలక సదస్సుకు హాజరయ్యే నిమిత్తం అమెరికా బయలుదేరిన లోకేశ్… ఐటీలో ప్రపంచంలోనే మేటి దిగ్గజాలుగా కొనసాగుతున్న కంపెనీలను వరుసబెట్టి చుట్టేస్తున్నారు. మంగళవారం ఉదయం రెండు దిగ్గజ కంపెనీల సెంట్రల్ ఆఫీస్ లకు వెళ్లిన లోకేశ్… సదరు కంపెనీల అధిపతులతో కీలక భేటీలు నిర్వహించారు. ఈ రెండు కంపెనీల్లో ఒకటి మైక్రోసాఫ్ట్ కాగా… రెండోది యాపిల్ కావడం గమనార్హం. సోమవారం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న టెస్లా కార్యాలయాన్ని సందర్శించిన లోకేశ్…ఆ కంపెనీ సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు మైక్రోసాఫ్ట్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్… ఆ సంస్థ సీఈఓగా ఉన్న తెలుగు ప్రముఖుడు సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు.
సత్య నాదెళ్లతో భేటీ ముగించుకుని మైక్రోసాఫ్ట్ కార్యాలయం బయటకు వచ్చిన లోకేశ్… అక్కడి నుంచి నేరుగా యాపిల్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా యాపిల్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్)గా ఉన్న ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. భారత్ లో యాపిల్ తన ఉత్పత్తుల తయారీ కర్మాగారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావించిన లోకేశ్…భారత్ లో యాపిల్ కార్యకలాపాలను విస్తరించాలని, అందులో భాగంగా నూతన యాపిల్ కర్మాగారాలను ఏపీలో ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని ప్రియాను కోరారు. ఈ సందర్భంగా ఆయన యాపిల్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఏపీలో తన ఉత్పత్తి కరాగారాన్ని యాపిల్ ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే… అక్కడే అందుకు అవసరమైన భూమిని కేటాయిస్తామని చెప్పారు. యాపిల్ కోరుకున్న చోట భూమిని కేటాయించడంతో పాటుగా యూనిట్ ను స్థాపించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కూడా లోకేశ్ చెప్పారు. అంతేకాకుండా ఏపీలో అపారమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, అదే ఏపీకి బలంగా ఉందని, ఏపీకి వచ్చే కంపెనీలకు ఇది ఓ సువర్ణావకాశంగా మారనుందని కూడా లోకేశ్ వివరించారు.
ఈ సందర్భంగా ఇటీవలే ఆవిష్కరించిన ఏపీ నూతన పారిశ్రామిక పాలసీని ప్రియాకు లోకేశ్ వివరించారు. భారీ పెట్టుబడులతో ఏపీకి వచ్చే సంస్థలకు టైలర్ మేడ్ ప్రోత్సాహకాలను అందించనున్నట్లుగా సదరు పాలసీలో పొందుపరచిన అంశాన్ని గుర్తు చేశారు. యాపిల్ లాంటి సంస్థలు తమ ఉత్పత్తులను ఆయా దేశాలకు, బారత్ లోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసుకునే సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. రోడ్డు, రైలు మార్గాలతో పాటుగా ఆకాశ, నౌకా యానంలోనూ ఏపీ నుంచి వివిధ ప్రాంతాలకు ఉన్న కనెక్టివిటీని లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. లోకేశ్ ప్రజెంటేషన్ మొత్తాన్ని సావదానంగా విన్న ప్రియా బాలసుబ్రహ్మణ్యం… ఏపీతో కలిసి పనిచేసే దిశగా ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు.