వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆస్తుల పంచాయితీ పెట్టుకుని పెద్ద తప్పే చేసినట్లుగా ఉంది. అప్పటిదాకా వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డల మధ్య మనస్పర్థలు ఉన్నా… అవి అంతగా పెద్దవేమీ కాదన్న వాదన ఉండేది. అంతేకాకుండా జగన్ ను పులిగా అభివర్ణిస్తూ ఆయన అభిమానులు చేసే వ్యాఖ్యలు, వాటికి అనుగుణంగా జగన్ నడుచుకునే తీరుతో జనం జగన్ ను నిజంగానే పులిగా… అంటే ఏ విషయంలో అయినా జగన్ పెద్దగా భయపడేవాడు కాదని భావించేవారు. ఇక రాజకీయాల్లో అయితే జగన్ ఏ ఒక్కరి వద్ద కూడా కాళ్ల బేరానికి దిగే రకం కారని కూడా ఆయన అనుయాయులు భావించేవారు. అయితే ఏ సమయాన జగన్ తన చెల్లితో ఆస్తుల పేచీ పెట్టుకున్నారో గానీ… జగన్ అసలు స్వరూపం ఏమిటన్నది క్రమంగా బయటపడిపోతోంది. తాజాగా జగన్ బావ గారు, వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ధైర్యమెంత అన్న విషయం బట్టబయలైపోయింది.
వాస్తవానికి బ్రదర్ అనిల్ కుమార్ వైఎస్ షర్మిలకు రెండో భర్త. షర్మిలను పెళ్లి చేసుకోకముందు నుంచే ఆయన క్రైస్తవ మత బోధకుడిగా ఉన్నారు. ఒక్క భారత దేశంలోనే కాకుండా పలు దేశాల్లో ఆయన తన బోధనలు కొనసాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఈయనను షర్మిల పెళ్లి చేసుకున్నారు. వైఎస్ఆర్ బతికున్నంత కాలం షర్మిల, జగన్ కుటుంబాల మధ్య మంచి అనుబంధాలు ఉండేవి. వైఎస్ ఆర్ చనిపోయాక చాలా కాలం పాటు జగన్ కు షర్మిల వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. షర్మిలకు ఏనాడూ అడ్డు చెప్పని అనిల్… బావమరిది రాజకీయ జీవితం ఉజ్వలంగా మారాలని ఆకాంక్షించారు. వారు అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం అయ్యారు. అప్పటిదాకా పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నా… జగన్ సీఎం కాగానే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. ఇప్పుడా పంచాయితీ రచ్చకెక్కింది. ఈ క్రమంలో బ్రదర్ అనిల్… జగన్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదర్కొన్నామన్న విషయాన్ని వెల్లడించారు.
బ్రదర్ అనిల్ కుమార్ చెప్పిన దాని ప్రకారం… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్నా… ప్రధాని నరేంద్ర మోదీ అన్నా జగన్ కు చచ్చేంత భయం. అందుకే కాబోలు… తనను క్రైస్తవ మత బోధనలను వదిలేయాలని జగన్ పలుమార్లు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని అనిల్ చెప్పుకొచ్చారు. ఓ వైపు బీజేపీ అంటే తమకేమీ భయం లేదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు కేంద్రంలో మద్దతు ఇస్తున్నామని జగన్ చెప్పే మాటలు పూర్తిగా అబద్ధమని అనిల్ వ్యాఖ్యలతో తేలిపోయింది. ఇక తెలంగాణలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నా కూడా జగన్ వణికిపోయేవారని కూడా అనిల్ చెప్పుకొచ్చారు. తన ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని, వాటిని కాపాడుకోవాలంటే కేసీఆర్ తో సఖ్యతగా ఉండక తప్పదన్న కోణంలో జగన్ భావించే వారని అనిల్ వ్యాఖ్యలు చెబుతున్నాయి. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు పొరుగు రాష్ట్రంలో రాజకీయాలెందుకు… వద్దు అంటూ షర్మిలను జగన్ అడ్డుకునే యత్నం చేశారని అనిల్ తెలిపారు. మొత్తంగా ధీరోదాత్తుడిగా పేరున్న జగన్… ఒట్టి భయస్తుడని ఆయనకు స్వయానా బావ అయిన అనిల్ చెప్పడం విశేషం…