లక్నోలో నివసిస్తున్న 32 ఏళ్ల అశుతోష్ సింగ్ తన ఇంటి సమీపంలో చెత్త ఉండడం గమనించారు. ఎప్పుడు చూసిన అది అలాగే ఉండడంతో ఎలాగైనా ప్రజలకు, మున్సిపాలిటి అధికారులకు బద్దోచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అందరిలా ఫిర్యాదు చేయడాలు, చెత్త వేయకండంటూ బోర్డులు పెట్టడాలు చేస్తే మామూలే కదా.. అలాంటి సాధారణమైనది అయితే మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడానికి కూడా ఏముంటుంది? అందుకే అశుతోష్ కాస్త విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన నిరసనతో మున్సిపాలిటి అధికారులకు చెమటలు పట్టడంతోపాటు.. ప్రజలకు బాధ్యత తెలిసేలా చేశాడు. మరి అదేంటో చూద్దాం..
అశుతోష్ ఉండే వీధిలో చెత్త ఉండడం కామనైపోయింది. అందుకే అందరూ అక్కడి తెచ్చి చెత్ల వేస్తుండడంతో.. చెత్త నుంచి వచ్చే దుర్గంధం భరింపరానిదిలా తయారైంది. మున్సిపల్ అధికారులేమో సమయానికి శుభ్రం చేయరు.. చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇక ఇదంతా భరించలేని అశుతోష్.. వెంటనే చెత్త కుప్ప పక్కన బొగ్గుల పొయ్యితో ప్రత్యక్షమయ్యాడు. అక్కడి చెత్తను ఏరి బొగ్గులతో నిప్పు పెట్టి వంట చేయడం మొదలుపెట్టాడు. చెత్తతో టీ, పన్నీర్ సలాడ్.. వంటి నోరూరించే వంటకాలు చేయడం ప్రారంభించాడు. అంతేకాదు.. ప్రజలకు వాటిని ఉచితంగా ఇవ్వడం ప్రారంభించాడు. అదేంటి చెత్త పక్కన.. చెత్తతో వండినవి తింటే అనారోగ్యం వస్తుంది కదా అనుకుంటున్నారా? అశుతోష్ కూడా అదే ప్రజలు అర్థం చేసుకోవాలని ఇలా చేశాడు. మరి అలా చెత్త వేయడం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది అనే విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఇలా చేశారు అశుతోష్.
ఈ విధంగా దాదాపు 3 గంటల పాటు వంటతో నిరసన తెలిపాడు అశుతోష్. అలా వంట చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మన్సిపల్ అధికారులకు అక్షింతలు పడ్డాయి. స్థానికులు కూడా అశుతోష్ చర్యకు మద్దతు తెలపడంతోపాటు.. ఇక పై అధికారులు చెత్తను సకాలంలో తొలగించకపోతే.. తాము కూడా అశుతోష్‌తో కలిసి ఇలాగే నిరసన తెలుపుతామంటూ అధికారులను హెచ్చరించారు.
ప్రజలలో చైతన్యం ఉంటే అధికారులు దారిలోకి వస్తారు అనే విషయం అశుతోష్ తన చర్యలతో నిరూపించాడు. అంతేకాదు.. ప్రజలు కూడా బాధ్యతతో అధికారులకు సహరించాలని లేకపోతే తామే రోగాల బారిన పడాల్సివస్తుందని ఈ సంఘటన ద్వారా స్పష్టమైంది.