మహబూబాబాద్ పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్ (9) కిడ్నాప్ కథ విషాదంతో ముగిసింది. కిడ్నాపర్ల చేతిలో బాలుడు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..
మహబూబాబాద్ లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి (9) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం సాయంత్రం గుర్తు తెలియన వ్యక్తి బైక్ పై వచ్చి తీసుకుని వెళ్లాడు. బాలుడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతకగా ఎవరో ఒక వ్యక్తి బండి మీద తీసుకెళ్లాడని స్నేహితులు చెప్పారు. అదే రోజు రాత్రి కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే పిల్లాడ్ని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరించారు. ఇంటి చుట్టుపక్కల తమ మనుషులు ఉన్నారని మీరు ఏమి చేసిన మాకు తెలుస్తుందని వారు అన్నట్లుగా బాలుని తల్లి వసంత తెలిపారు.
కిడ్నాపర్లు మళ్లీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేసి.. డబ్బు సిద్ధం చేసుకోండి. బుధవారం ఫోన్ చేస్తానని చెప్పినట్లుగానే అగంతకుడు బుధవారం ఉదయం 11 గంటలకు ఫోన్ చేసి డబ్బుతో పాటు జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల ప్రాంతానికి రావాలని చెప్పారు. చెప్పినట్లుగానే బాలుడి తండ్రి మధ్యాహ్నం 1 గంటకు డబ్బు ఉన్న బ్యాగ్ ను తీసుకుని మూడు కోట్ల ప్రాంతానికి వెళ్లినప్పటికీ అక్కడికి కిడ్నాపర్లు రాలేదు. అయినా రాత్రి వరకు వేచి చూశారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో కిడ్నాపర్లను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు.నిందితులను విచారించగా కిడ్నాప్ చేసిన రోజే బాలుడ్ని హతమార్చినట్లు వారు పేర్కొన్నారు. శనగపురం గుట్టల్లో బాలుడి మృతదేహన్ని గుర్తించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి వారి బంధువులైన మనోజ్ రెడ్డి సహా మరో నలుగురిని అరెస్ట్ చేశారు.











