టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా.. మ్యాజిక్ చేయగల స్టార్ హీరోల్లో మహేశ్ బాబు చాలా ప్రత్యేకం. అతడి సినీ కెరీర్ లో విజయాలు , పరాజయాలు సమానంగా ఉంటాయి. రెండు సినిమాలతో వరుసగా అభిమానుల్ని నిరాశపరుస్తాడు. అంతలోనే మరో రెండు బ్లాక్ బస్టర్స్ తో సమాధానం చెబుతాడు. ఇంతవరకూ అతడి కెరీర్ ఆదే పాట్రన్ లో రన్ అయింది. అయితే అతడి సక్సెస్ ఫుల్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపితే.. ఫ్లాప్ సినిమాలు ప్రేక్షకుల హోమ్ బాక్సాఫీస్ వద్ద అంటే.. టీవీల్లో హైయెస్ట్ రేటింగ్స్ తో విరుచుకుపడడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది.
మహేశ్ బాబు కెరీర్ లో త్రివిక్రమ్ తీసిన ‘అతడు’ చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది విడుదలైనప్పుడు థియేటర్స్ వద్ద చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది. వెంకీ ‘వారసుడొచ్చాడు’ సినిమానే త్రివిక్రమ్ మళ్ళీ తీశాడనే విమర్శలొచ్చాయి. అందులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్ ఉన్నప్పటికీ.. ఆడియన్స్ అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఈ సినిమాకి టీవీలో ప్రసారమైనప్పుడు విపరీతమైన స్పందన లభించింది. ఒక ప్రముఖ ఛానల్ ఇప్పటికీ అతడు సినిమా మీదే… బోలెడంత రెవెన్యూ సంపాదించింది. ఇంకా సంపాదిస్తూనే ఉంది. అంతేకాదు.. అతడు టీవీలో ఎప్పుడు ప్రసారమైనా హైయెస్ట్ రేటింగ్ దక్కడం విశేషం.
ఇక మహేశ్ బాబు ఖలేజా సినిమా కూడా థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. కథ సీరియస్ మోడ్ లో ఉన్నప్పటికీ.. హీరో కామెడీ చేస్తాడనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాకి కూడా టీవీల్లో ఎప్పుడు ప్రసారమైనా.. మంచి రేటింగ్స్ వస్తాయి. ముఖ్యంగా అందులోని పాటల కోసం , మహేశ్ కామెడీ పంచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోతారు. అలాగే.. యూ ట్యూబ్ లో ‘ఖలేజా’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కీ మంచి వ్యూస్ దక్కాయి.
ఇక ఇప్పుడు మహేశ్ బాబు మరో ఫ్లాప్ సినిమా యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా ఆగడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో అట్టర ఫ్లాప్. దూకుడు తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్ తో ‘ఆగడు’ సినిమాలను తీసిన శ్రీనువైట్ల కెరీర్ కు ఈ సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ సినిమా రిజల్ట్ నుంచి శ్రీను వైట్ల ఇప్పటికీ తేరుకోలేకపోయాడు. అయితేనేం? ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు యూ ట్యూబ్ లో రికార్ట్ స్థాయిలో 500 మిలియన్ వ్యూస్ తెచ్చుకొని జనానికి షాక్ ఇచ్చింది.
రగ్డ్ కాప్ గా మహేశ్ బాబు పెర్ఫార్మెన్స్, అతడి కామెడీ టైమింగ్ ఉత్తరాది వారిని భలేగా ఆకట్టుకుంటోంది. మహేశ్ ఫ్లాప్ సినిమాలే ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుంటే.. అతడి హిట్ సినిమాలకు ఇంకెతటి ఆదరణ దక్కాలి? అందుకే మహేష్ గత చిత్రాల్ని కూడా యూ ట్యూబ్ లో హిందీ డబ్బింగ్ వెర్షన్ రూపంలో విడుదల చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.ఆ మేరకు భారీ డీల్ కూడా మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. సో.. మరకే మంచిదే కదూ.. !