ఈ సంక్రాంతి సినిమాల్లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ ఏ రేంజ్ వసూళ్ళు రాబట్టిందో తెలిసిందే. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి గట్టిపోటీనిచ్చి.. రేస్ లో నెం.1 గా నిలిచింది. ఈ సినిమాతో దర్శకుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ కోటా పూర్తి చేశాడు. అంతకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేశ్ బాబు వంతు వచ్చింది. ‘అతడు, ఖలేజా’ సినిమాలతో మహేశ్ బాబులోని ఓ కొత్త కోణాన్ని తెరమీద ఆవిష్కరించిన గురూజీ.. త్వరలోనే ప్రిన్స్ తో హ్యాట్రిక్ మూవీ తీసే ప్రయత్నంలో ఉన్నాడు.
ఎప్పటి నుంచో త్రివిక్రమ్ మహేశ్ బాబు తో.. మూడో సినిమా తీయాలని ప్రయ త్నిస్తున్నాడు. మహేశ్ బాబు కమిట్ మెంట్స్ వల్ల అది సాధ్యం కావడం లేదు. అయినా సరే ఎలాగైనా వీలు చేసుకొని .. హ్యాట్రిక్ కంప్లీట్ చేసేస్తే… అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతారని త్రివిక్రమ్ ఆ దిశగా తన ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు తారక్ తో తదుపరి సినిమా సన్నాహాల్లో ఉన్నాడు. పోయిరావలె హస్తినకు అనే వెరైటీ టైటిల్ తో ఈ సినిమా రూపొందనుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డిటైల్స్ రానున్నాయి.
కరోనా అవుట్ బ్రేక్ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మహేశ్ బాబు తో చేయబోయే సినిమా స్టోరీని తీర్చిదిద్దుతున్నాడట. ఇటీవలే మహేశ్ బాబు ను కలిసి ఈ సినిమా స్టోరీ లైన్ ను డిస్కస్ చేశాడట. మహేశ్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. ఈ సినిమా స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ‘సీతారామపురం’ అనే టైటిల్ ను కూడా సినిమా కోసం రిజిస్టర్ చేశారట. 1967 లో అక్కినేని , జగ్గయ్య నటించిన పి.పుల్లయ్య సినిమా‘ ప్రాణమిత్రులు’ స్టోరీ లైన్ తో సినిమా తెరకెక్కనుందట.
ఒక మల్టీమిలియనీర్ , అతడి సర్వెంట్ మధ్య నున్న ఫ్రెండ్ షిప్ , ఎమోషన్స్ మీద ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ కథ ఇప్పటికే ఎన్నో రకాలుగా తెరకెక్కింది. అనేక భాషల్లో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రజనీ అన్నామలై కథ కూడా ఇదే. అప్పట్లో సూపర్ హిట్టయిన ఈ సినిమా కథ కు .. త్రివిక్రమ్ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి.. మోడ్రన్ టచ్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం మహేశ్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి తో ఓ సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చాడు.
ప్రస్తుతం జక్కన్న ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఆ గ్యాప్ లో మహేశ్ త్రివిక్రమ్ మూవీలో నటించే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికి యన్టీఆర్ సినిమాను కంప్లీట్ చేసేస్తే.. త్రివిక్రమ్ కూడా ఫ్రీ అయిపోతాడు. మరి అనుకున్నంత తేలిగ్గా ఆ కాంబో సెట్స్ మీదకు వెళుతుందో లేదో అనే సందేహమూ లేకపోలేదు. ఏదేమైనా మహేశ్ , త్రివిక్రమ్.. తన కలయికలో మూడో సినిమా చేయడం పక్కా కాబట్టి.. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో, అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.











