విశాల్ సినిమా అంటేనే యాక్షన్ పాళ్లు ఎక్కువే. అతని ఫిజిక్ కు తగ్గట్టుగా ఉండే కధాంశాలను అతను ఎంచుకుంటాడు. ఈసారి డిజిటల్ క్రైమ్ నేపథ్యంతో రూపొందించిన సినిమా ‘చక్ర’. ఎం.ఎస్. ఆనందన్ ఈ సినిమా ద్వారా తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా కథా హక్కుల విషయంలో విడుదల కోర్టు వరకూ వెళ్లినా ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా విశేషాలు చూద్దాం.
కథలోకి వెళితే..
ఆగస్టు 15న జరిగిన వరుస దోపిడీలతో కథ ప్రారంభమవుతుంది. వరసగా జరిగిన ఈ దోపిడీలకు సంబంధించిన కేసును కమిషనర్ పోలీస్ ఆఫీసర్ గాయత్రి (శ్రద్ధా శ్రీనాధ్)కు అప్పగిస్తారు. అప్పటికే ఆమె చంద్రు (విశాల్)తో ప్రేమలో ఉంటుంది. దోపిడీ గురైన ఇళ్లలో చంద్రు ఇల్లు కూడా ఉంటుంది. చంద్రు ఓ మిలటరీ ఆఫీసర్. అతని తండ్రికి సంబంధించిన అశోక చక్ర అవార్డును కూడా దోపిడీ దారులు దోచుకుంటారు. ఈ దోపిడీలు చిన్న దొంగల పని కాదని, దీని పెద్ద నెట్ వర్క్ ఉందని కేసు దర్యాప్తులో బయటపడుతుంది.
ఈ కేసు దర్యాప్తులో గాయత్రికి చంద్రు సహాయ పడతాడు. అలా అనడం కన్నా అతనే ఈ కేసును కొలిక్కి తెస్తాడు అనుకోవచ్చు. డిజిటల్ క్రైమ్ తో ఈ నేరాలన్నీ ముడిపడతాయి. ఆ నెట్ వర్క్ వెనక లీల (రెజీనా) అనే ఓ యువతి ఉందన్న విషయం బయటపడుతుంది. ఆమె ఆటకట్టడానికి చంద్రు ఏంచేశాడు అన్నదే కథ. డిజిటల్ నేరాలకు సంబంధించిన కథాంశం కాబట్టి ఆ ఎత్తుగడలతో ఈ కథను అల్లారు.
ఎలా తీశారు? ఎలా చేశారు?:
ఈ డిజిటల్ నేరాలకు సంబంధించిన చిత్రాలు ఇంతకుముందు కూడా వచ్చాయి. గతంలో విశాల్ చేసిన ‘అభిమన్యుడు’ తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. హ్యాకింగ్ నేటి సమాజంపై ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది?, డిజిటల్ నేరగాళ్లు ఎందుకు తయారవుతున్నారు? దీన్ని ఎలా అరికట్టవచ్చు? అనే అంశాలను డర్శకుడు ఈ సినిమాలో డీల్ చేశాడు. చంద్రుగా విశాల్ బాగా చేశాడు. కాకపోతే ఈ కథ మధ్య మధ్యలో ట్రాక్ తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. శ్రద్ధ శ్రీనాథ్, రెజీనా తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధ దూకుడు ఈమెలో ఈ యాంగిల్ కూడా అనిపిస్తుంది.
అది ఎలాంటి కథ అయినా విలన్ పవర్ ఫుల్ గా ఉంటేనే సినిమా రక్తి కడుతుంది. పైగా ఇందులో విలన్ ఓ యువతి. ఆమెను మిలటరీ ఆఫీసర్ పట్టుకోవడం అంటే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఉంటుంది. పైగా ఇందులో మైండ్ గేమ్ కూడా రక్తి కట్టలేదు. కాకపోతే థ్రిల్లింగ్ అంశాలు ఇందులో ఉన్నాయి. పోనీ డిజిటల్ క్రైమ్ అంశాన్ని ఎంచుకున్నప్పుడు ఆ స్థాయిలో దోపిడీలనే ఎంచుకోవాలి. అక్కడ కూడా చిల్లర దొంగతనాలే అన్నట్టు ఉంటుంది. ఎత్తకు పై ఎత్తుకు వేసే అంశాలు కూడా చెవిలో పువ్వు పెట్టేలా ఉన్నాయి.
డిజిటల్ క్రైమ్ అని ఏదేదో ఊహించేసుకుని సినిమాకి వెళితే నిరాశ తప్పదు. విశాల్ కోసం ఫైట్స్ పెట్టాల కాబట్టి మధ్యలో కొందరు నేరగాళ్లను ఈ కథలో కలిపి హీరో వాళ్లతో పోరాట సన్నివేశాలను చూపించాల్సి వచ్చింది. విలన్ డిజిటల్ క్రైమ్ లో తోపు అని చూపించేరేగానీ ఎక్కడా ఆ ఊపు కనిపించదు. సంగీతానికి కూడా పెద్దగా అవకాశం లేదు. ఒకే ఒక పాట ఉంది. రీరికార్డింగ్ ఫరవాలేదు. విలన్ ఇంకాస్త ఎలివేట్ అయి.. ఆ విలన్ ను కనుక్కోవడంలో హీరో చాలా కష్టపడ్డట్టు చూపిస్తే ఈ సినిమాకు కొంత ఫలితం ఉండేది.
నటీనటులు: విశాల్, రెజీనా కసాండ్రా,శ్రద్ధ శ్రీనాథ్, కేఆర్ విజయ, రోబో శంకర్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
కెమెరా: బాల సుబ్రహ్మణియన్
నిర్మాత: విశాల్
రచన – దర్శకత్వం: ఎం.ఎస్. ఆనందన్
విడుదల: 19-02-2021
ఒక్క మాటలో: నో డిజిటల్.. ఓన్లీ క్రైమ్
రేటింగ్: 2.5/5
– హేమసుందర్ పామర్తి











