తెలంగాణాలోకి మావోయిస్టుల ప్రవేశించారా…!? దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం వెలిగిపోనున్నదా…!? గత వైభవం కోసం మావోయిస్టులు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయా..!? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తూంటే. గడచిన రెండు నెలలుగా ఖమ్మం, వరంగల్ సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించారనే ఇంటెలిజెన్సీ నివేదికలు ఉన్నాయి. గడచిన వారం రోజుల్లో డీజీపీ అదిలాబాద్ జిల్లాలో మకాం వేసి అక్కడి అడవుల్లో కూంబింగ్ ను స్వయంగా పర్యవేక్షించారు. గత దశాబ్దకాలంలో ఇలా డీజీపీ స్ధాయి అధికారి ఓ జిల్లాలో స్వయంగా పర్యవేక్షణ జరపడం లేదంటున్నారు. డీజీపీ పర్యవేక్షణ మావోయిస్టులు వచ్చారనే వాదనకు బలం చేకూర్చింది. పైగా డీజీపీ కూడా మీడియాతో మాట్లాడుతూ “ఫలానా నాయకుడు వచ్చాడని కాదు కాని… వారి కదలికలపై నిఘా ఎప్పుడూ ఉంటుంది “ అన్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే ఖమ్మం, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఎన్ కౌంటర్ కూడా జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ పోలీస్ కూడా గాయపడడంతో ఇది నిజమైన ఎన్ కౌంటరేనని నిర్ధరణ అయ్యింది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలికిడి తగ్గి దాదాపు ఐదేళ్లయ్యింది అంటున్నారు. ఎన్నికల సమయంలో అక్కడక్కడ ఎన్నికలు బహిష్కరించండి అంటూ పోస్టర్లు వెలియడం తప్ప ఎన్ కౌంటర్ వంటివి జరగలేదు. ఈ ఎన్ కౌంటర్ తో మళ్లీ సరిహద్దు ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. మళ్లీ తాజాగా ఆదివారం రాత్రి మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అది జరిగి 24 గంటలు ముగియక ముందే మళ్లీ అదే స్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టుల ప్రవేశం నిజమేనంటున్నారు.
గణపతి లొంగుబాటు కట్టుకథేనా…!
మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారనే వార్తలు, వాదనలు వస్తున్న సమయంలోనే మావోయిస్టు పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి లొంగిపోతున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఈ కథనాలతో మళ్లీ అలజడి ప్రారంభమైంది. గణపతి ఒక్కరే కాదు పెద్ద నాయకులు లొంగిపోయేందుకు క్యూ కడుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇలా నాలుగు రోజుల గందరగోళం తర్వాత మావోయిస్టు పార్టీ స్వయంగా ఓ లేఖను విడుదల చేసింది. గణపతి లొంగిపోవడం లేదని, ఇదంతా పోలీసులు, ప్రభుత్వాల కుట్ర అని ఆ లేఖల సారాంశం. ఆ లేఖ విడుదలైన తర్వాత లొంగుబాటు వార్తల ప్రవాహం ఆగిపోయింది.
అంటే మావోయిస్టులు తెలంగాణాలో ప్రవేశిస్తున్నారు కాబట్టి, దాని ప్రభావం తగ్గించం కోసం పోలీసులే లొంగుబాటు కథనాలు వచ్చేలా చేసారా అనే అనుమానాలు వస్తున్నాయి. మావోయిస్టులు గత కొంతకాలంగా చాప కింద నీరులా తెలంగాణాలో కార్యక్రమాలు చేస్తున్నారని పోలీసులు, ఇంటెలిజెన్పీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ముగ్గురు అక్కచెల్లెళ్లలను పోలీసులు నగరంలో అరెస్టు చేశారు. వారు మావోయిస్టులని, కొంతకాలం అడవుల్లో దళాల్లో పని చేసి వచ్చారని పోలీసులు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొందరిని నగరంలో మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు అరెస్టు చేశారు. అంటే అప్పటి నుంచే తెలంగాణాలో మావోయిస్టుల కదలికలు ప్రారంభమయ్యాయా అనే వాదనలు వస్తున్నాయి. మొత్తానికి మావోయిస్టుల తెలంగాణా ప్రవేశం నిజమే అయితే ఆనాటి తుపాకుల శబ్దాలు మళ్లీ వినాల్సి వస్తుందేమో అని తెలంగాణ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.











