మావోయిస్టు పార్టీ తెలంగాణలో పాగా వేస్తోందా..? సరిహద్దు జిల్లా నుంచి మవోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశించారా. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీస్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారా…? తెలంగాణ సరిహద్దు జిల్లాలలో గడచిన వారం రోజులుగా పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ నిజమేననిపిస్తోంది.
వీటికి తోడు కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా మావోయిస్టు అగ్రనేతల తెలంగాణా ప్రవేశాన్ని ధృవీకరిస్తున్నాయి. రాష్ట్ర డిజీపీ ఎం. మహేంద్ర రెడ్డితో పాటు ఇంటెలిజెన్సీ అధికారులు, కేంద్ర హోం శాఖ సీనియర్ భద్రత సలహాదారుడు కె. విజయ్ కుమార్, సీఆర్ పిఎఫ్ డిజి మహేశ్వరితో పాటు ఇతర ఉన్నతాధికారులు ములుగు జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన వెంకటాపురం అడవులలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశించడం, వారిని కట్టడి చేయడం వంటి అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దులలో సంచరిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిఘాను పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఉనికి కోసం ఏదైనా చేస్తారా…!
మావోయిస్టులు తాము తెలంగాణలోకి ప్రవేశించామనే ఉనికిని చాటుకునేందుకు ఎలాంటి చర్యలకైనా పాల్పడతారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకోసం సరిహద్దు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో తమ ఉనికిని తెలియజేయడంతో పాటు తాము టార్గెట్లుగా ఎంచుకున్న ప్రజాప్రతినిధులను నక్సలైట్లు హతమార్చేవారు.
ఇప్పుడు కూడా అదే పంథాను అవలంబిస్తారా లేక కొత్త మార్గాలలో తమ ఉనికిని చాటుతారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు తమ ప్రతీకారాన్ని తీర్చుకోదలిస్తే వారికి భద్రత కల్పించడం పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు. తెలంగాణ ఏజేన్సీలోని ప్రజాప్రతినిధులను హైదరాబాద్ తరలించాల్సి ఉంటుందని లేదా వారికి ప్రత్యేక సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రజాప్రతినిధులకు జాగ్రత్తలు సూచించినట్లు చెబుతున్నారు.
విధ్వంసం సృష్టిస్తారా…?
తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు అగ్రనేతలు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేయకుండా ఎక్కడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందా అని అధికారులు యోచిస్తున్నారు. ప్రజాప్రతినిధులను హతమార్చడం వల్ల పట్టు తగ్గిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా విధ్వంసం సృష్టించడం ద్వారా తెలంగాణాలో తమ పట్టు నిలుపుకోవచ్చు అన్నది మావోయిస్టుల ఎత్తుగడగా చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా తమ ఉనికిని చాటుకున్న మావోయిస్టులు ఆ తర్వాతే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు.
ఈ సారి కూడా అదే పంథాను అవలంబించే అవకాశం ఉందని ఇంటెలీజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు కూడా రాష్ట్ర పోలీసులకు ఇలాంటి సూచనే చేసినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ భద్రత సలహాదారుడు కె.విజయ్ కుమార్ ములుగు జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో జరిగిన కీలక సమావేశానికి హాజరు కావడం కూడా ఇందులో భాగమే అంటున్నారు.
మావోయిస్టుల రాకతో పాటు వారిని కట్టడి చేయడంపై ముందుగానే పటిష్టమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావని కేంద్ర భద్రత సలహాదారుడు విజయ్ కుమార్ సూచించినట్లు చెబుతున్నారు.











