ఉమ్మండి ఖమ్మం జిల్లా పరిధిలోని చర్ల మండలం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల.మండల పరిధిలోని పెద్ద మిడిసిలేరు మీదుగా తిప్పాపురం వెళ్లే ప్రధాన రహదారిని ఆదివారం అర్ధరాత్రి పేల్చిన మావోయిస్టులు. అర్ధరాత్రి వేళలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించడంతో సమీప గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తర్వాత అది నక్సలైట్ల చర్యగా తెలిసింది.
తెలంగాణ ప్రాంతం మావోయిస్టులకు ఒకప్పట్లో పెట్టని కోటలా ఉండేది. కానీ. అదంతా కూడా గతం. ఇటీవలి కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తక్కువ అయ్యాయి. అలాంటిది ఒక్కసారిగా ఈ అర్ధరాత్రి పేలుళ్లో జనం భయాందోళనకు గురయ్యారు.
అస్తిత్వం చాటుకోవడానికేనా?
మావోయిస్టు పార్టీ బలహీన పడుతున్నట్లుగా ఒక ప్రచారం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్లుగా మీడియాలో విస్తారమైన కథనాలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఈ మేరకు గణపతి మంతనాలు జరుపుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారని ప్రచారం జరిగింది. ఒకప్పట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా చేసిన గణపతి లొంగిపోవడం అంటే.. అదే పార్టీ బలహీన పడుతుండడానికి సంకేతం అనే ప్రచారం కూడా జరిగింది.
రెండు రోజులు ఈ ప్రచారం సాగిన తర్వాత, మావోయిస్టు పార్టీ దీనిని ఖండించింది. అవన్నీ ప్రభుత్వాలు అల్లిన కట్టు కథలే అని పేర్కొంటూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ గురించి బలహీనపడుతున్నట్లుగా ప్రచారం జరగడం, ప్రజల్లో అనుమానాలు పుట్టే పరిస్థితి రావడంతో.. తమ అస్తిత్వ నిరూపణకు ఏదో ఒక చర్యకు దిగుతారని కూడా పలువురు భావించారు. దానికి తగ్గట్టుగానే.. చర్లమండలం తిప్పాపురం దారిని మావోయిస్టులు పేల్చివేయడం గమనార్హం.











