పరిపాలనా రాజధానిగా విశాఖను చేయబోతున్న తరుణంలో భూ కబ్జాల పై అటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో.. తాము అధికారంలో ఉండగా భూ ఆక్రమణలకు తావే లేదు.. అన్న సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం ఇటు పోలీసులు అటు ప్రభుత్వం చేస్తున్నట్టు వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి. పోతినమల్లయ్య పాలెం లో ఓ ప్రైవేట్ ప్రాపర్టీ విషయంలో విశాఖ పోలీసులు ఆదివారం ఐదుగురిని అరెస్టు చేశారు. గత నెల ఇసుక తోటలో ఓ ప్రైవేట్ ప్రాపర్టీ కి సంబందించిన విషయంలోనూ కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తమ స్థలంలోకి ప్రవేశించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు ఉదంతాలు భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామనే సంకేతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
సాధారణంగా ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే గతంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యేవారు. అటువంటి వివాదాలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో సివిల్ తగాదాలు ఓ అంచనా ప్రకారం లక్షకు పైనే జిల్లా కోర్టులో, హైకోర్టులో వివాదాలు నడుస్తున్నట్టు న్యాయవాదులు పేర్కొంటున్నారు.
ఎన్నడూ లేనిది ఆగమేఘాలపై అరెస్టులు…
గత కొద్దిరోజులుగా సివిల్ వ్యవహారాల్లోనూ పోలీసులు చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతున్నారు. దౌర్జన్యం , నకిలీ పత్రాలు, ఆస్తుల ధ్వంసం, ఒకరిపై ఒకరు దాడి ఇలాంటి లా అండ్ ఆర్డర్ కారణాలతో ముడిపెడుతూ కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను పోలీసులే తేల్చి పారేస్తున్నారు.
భూ అక్రమాలకు తావు లేదని హెచ్చరికలు..
విశాఖ పరిపాలన రాజధానిగా మారే సమయానికి భూ ఆక్రమణలకు తావులేదనే సంకేతాన్ని బలంగా చెప్పేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు అనేక వర్గాలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని నిరూపించే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తోంది. అప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం వెనుక ఎటువంటి భూ లావాదేవీలు దాగి లేవని చెప్పే ప్రయత్నం పోలీసుల ద్వారా చేస్తున్నారు.
గతంలోనూ పోలీసులు ఇదే రీతిలో వ్యవహరించి ఉంటే విశాఖలో భూ కుంభకోణాలకు, భూ ఆక్రమణలకు తావు ఉండేది కాదని, అసలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ను ఏర్పాటు చేయాల్సిన పని ఉండేది కాదనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది.










