(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ నేతలు నయాదందాకు తెరలేపారు. రేషన్ బియ్యం పాలిష్ వేసి కాకినాడ రేవు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. నరసరావుపేట సమీపంలోని రావిపాడులో స్వప్నా ట్రేడర్లు రైస్ మిల్లులో 4000 బస్తాల భారీ రేషన్ డంప్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ రైస్ మిల్ వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన పుల్లారెడ్డి ది కావడం గమనార్హం.
ఈ దందా సంవత్సరకాలంగా జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు ఎస్పీకి కొందరు ఫిర్యాదు చేయడంతో, ఎస్పీ అమ్మిరెడ్డి నరసరావుపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నరసరావుపేట పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఏక కాలంలో రావిపాడులోని వైసీపీ నేత పుల్లంరెడ్డి రైస్ మిల్లుపై దాడి చేసి భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు.
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
కోస్తా జిల్లాల్లో రేషన్ మాఫియా రెచ్చి పోతోంది. కోస్తాలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఎవరూ తినడం లేదు. రేషన్ దుకాణం నుంచి బియ్యం తెచ్చుకుని లబ్దిదారులు కిలో రూ.10 కు చిరు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు రేషన్ మాఫియాకు కిలో రూ.14కు అమ్ముకుంటున్నారు. ఇక రేషన్ మాఫియా ఆ బియ్యాన్ని రైసు మిల్లుల్లో పాలిష్ చేసి, జిలేబీ ఆయిల్ తో కోటింగ్ వేసి రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే జారిపోయేలా ఫైన్ క్వాలిటీ లుక్ తీసుకు వస్తున్నారు. ఇలా తయారు చేసిన బియ్యాన్ని కిలో రూ.33కు కాకినాడ ఓడరేవు నుంచి విదేశాలకు ఎగుమతి చేసే బడా వ్యాపారులకు చేర్చుతున్నారు. అలా ఏపీ రేషన్ బియ్యం మొత్తం కాకినాడ రేవు ద్వారా ఆఫ్రికా దేశాలకు చేరుతోంది.
అధికారుల అండతో చెలరేగిపోతున్న మాఫియా
అధికారంలో ఎవరు ఉన్నా రేషన్ మాఫియా తన పని సాఫీగా సాగేలా చూసుకుంటుంది. ప్రభుత్వం లబ్దిదారులకు రేషన్ సరఫరా చేసిన వారంలోనే, ఆ బియ్యాన్ని మెరుగుపరచి కాకినాడ రేవు ద్వారా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా ప్రతి నెలా కాకినాడ రేవు నుంచి 2 లక్షల టన్నుల బియ్యం ఆఫ్రికాలోని ఉగాండా, కెన్యా దేశాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎప్పుడో ఒక కేసు నమోదు చేసి సైలెంట్ అయిపోతున్నారు. రేషన్ మాఫియా సంబంధిత అధికారులందరికీ ప్రతి నెలా క్రమం తప్పకుండా మామూళ్లు చెల్లిస్తోందని సమాచారం. అందుకే లక్షలాది టన్నుల రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్నా ఎవరికీ తెలియనట్టు అధికారులు నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నారు.











