మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన పాత్రను చేసుకుని రూపొందించిన సినిమా ఇది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాని నిర్మించారు.ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
మనిషి జీవితంతో సెల్ ఫోన్ కు బంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సెల్ ఫోన్ బయోపిక్ అంటూ దీన్ని తెరకెక్కించారు. కొందరి జీవితాల్లో ఈ సెల్ ఫోన్ ఎలాంటి మార్పు తెచ్చింది? వారి జీవితాలు ఏమయ్యాయి? చివరికి ఈ సెల్ ఫోన్ కథ ఎలా ముగిసింది అన్నదే ఇందులోని ప్రధాన అంశం. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఓ సినీ తార జీవితంతో ప్రారంభమైన ఈ సెల్ ఫోన్ కథ పాక్ స్థాన్ ఉగ్రవాదులను తుదముట్టించేదాకా వెళుతుంది. లాజిక్ కోసం చూడకుండా ఈ సినిమాలో ఎలాంటి మేజిక్ చేశారన్నదే చూడాలి. వినోదానికి పెద్ద పీట వేశారు. ఇలాంటి కథకు పెద్ద హీరోలతో పనిలేదు.
సినీ నటి పాయల్(పాయల్ రాజ్ పుత్)కు చిత్ర నిర్మాత ఓ సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. అది ఆమె ప్రియుడు ప్రణయ్(రజత్ రాఘవ్)కు నచ్చదు. ఆ ఫోన్ కారణంగా వారిద్దరి మధ్యా విభేదాలు ప్రారంభమవుతాయి. దాంతో ఆమె తన ఫోన్ ను అసిస్టెంట్ కు గిఫ్ట్ గా ఇచ్చేసి దాన్ని వదిలించుకుంటుంది. చివరికి అది ఓ కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు చేతికి చేరుతుంది. అతని జీవితం వీధిన పడే పరిస్థితికి ఆ ఫోన్ కారణమవుతుంది. తన నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఈ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఓ యువ జంట కార్ వాష్ చేసే ఆలీ(విరాజ్ అశ్విన్), అస్రాని(సిమ్రత్ కౌర్)ల జీవితంలోకి ఇదే ఫోన్ చేరుతుంది. అది వారి బ్రేకప్ కు దారి తీస్తుంది.
ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డు నారాయణ(సునీల్) జీవితంలోకి కూడా ఈ ఫోన్ చేరుతుంది. ఆ ఫోన్ వచ్చాక అతను తన భార్య పాత్రధారి యాంకర్ శ్యామలతో కలిసి పాటలకు డ్యాన్స్ చేస్తూ నెక్లెస్ గొలుసు నారాయణగా పేరుతెచ్చుకుంటాడు. ఆ తర్వాత బతుకు తెరువు కోసం హిజ్రా వేషం వేసుకు బతికే శీను (శ్రీనివాసరెడ్డి) వద్దకు ఈ ఫోన్ చేరుతుంది. అతని జీవితం గాడిన పడటానికి పరోక్షంగా ఈ ఫోన్ కారణమవుతుంది. ఇలా ఒకే ఫోన్ వివిధ వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అన్నదే ఈ చిత్ర కథ. సెల్ ఫోన్ వల్ల మంచి చెడు రెండూ ఉంటాయనే సందేశాన్ని దర్శకుడు అంతర్లీనంగా ఇచ్చాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
వినోదాత్మకంగా సినిమాని మలిచినా అవసరమైనదానికన్నా ఎక్కువ సన్నివేశాలను చొప్పించడంతో నిడివి పెరిగిన భావన కలుగుతుంది. కమెడియన్ పృధ్వీ, యువజంట ప్రేమకథ, సునీల్ -శ్యామల ఎపిసోడ్ రక్తి కట్టించాయి. శ్రీనివాసరెడ్డి జీవితంలో కొన్ని సన్నివేశాలను తొలగిస్తే సరిపోయేది. పాయల్ రాజ్ పుత్ పాత్ర నిడివి కూడా తక్కువే. కొన్ని పాత్రలు నిజజీవిత పాత్రల్లానే ఉంటాయి. ముఖ్యంగా నెక్లెస్ గొలుసు నారాయణ కథ. అలాగే పృధ్వీ పాత్ర కూడా మోతాదు మించి ఉంటుంది. అంబటి రాంబాబు కొంత మంది మహిళలతో సెల్ ఫోన్లో మాట్లాడిన మాటలు కొన్ని సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. అలాంటి సన్నివేశాన్ని కూడా ఇందులో చూపించారు. అలాగే పృథ్వీ కూడా తనను తానే ఇమిటేట్ చేసుకోడానికి వెనుకాడలేదు.
విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ ప్రేమకథ అలరిస్తుంది. సిమ్రత్ కు నటిగా అవకాశాలు పెరగడానికి ఈ పాత్ర ఉపకరిస్తుంది. పాత్ర పరిధి మేరకే ఆమె నటించి మెప్పించింది. టెర్రరిస్టులకు కూడా ఈ సెల్ ఫోన్ ఎలా ఉపయోగపడుతుందో చూపించారు. సినిమా టైటిల్ మాయాపేటిక అని ఉంది కదా అని ఇందులో మాయలు మంత్రాలు కోసం చూస్తే నిరాశపడక తప్పదు. ఇది ఓ సెల్ ఫోన్ కథ అని మాత్రమే తెలుసుకుని వెళ్లడం మంచిది. పైగా ఇది ఫాంటసీ సినిమా కూడా కాదు. వినోదాన్ని కోరుకునే వారికి పసందైన విందు అందిస్తుంది. నిడివి తగ్గితే సినిమా ఎంజాయ్ చేయవచ్చు.
నటీనటులు: పాయల్ రాజ్ పుత్, రజత్ రాఘవ్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, యాంకర్ శ్యామల తదితరులు.
సాంకేతిక వర్గం: గుణ బాలసుబ్రహ్మాణ్యం
నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
రచన, దర్శకత్వం: రమేశ్ రాపర్తి
విడుదల తేదీ: జూన్ 30, 2023
ఒక్క మాటలో: మాయలు లేని పేటిక
రేటింగ్: 2.5/5