నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.చిన్న హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న నిఖిల్ ఈ స్పై మూవీతో ఎలాంటి ఫలితాన్ని రాబట్టాడో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమా. జయ్ (నిఖిల్) అన్న సుభాష్ (అర్యాన్ రాజేష్) రా ఏజంట్ గా పనిచేస్తూ అబ్దుల్ ఖాదిర్ (నితిన్ మెహతా) అనే టెర్రరిస్ట్ చేతిలో చనిపోతాడు. ఐదేళ్ల తర్వాత అతని స్థానంలో అదే ఉద్యోగంలో చేరిన జయ్ తన అన్నయ్య ఎలా చనిపోయాడు? అన అన్న మరణం వెనుక ఏం జరిగింది? అబ్దుల్ ఖాదిర్ వెనక ఇంకా ఎవరున్నారు? అనే దర్యాప్తు ప్రారంభిస్తాడు. రా చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్ పాండే) పర్యావేక్షణలో ఈ దర్యాప్తు సాగుతుంది. నిఖిల్ అసిస్టెంట్ గా అతని స్నేహితుడు కమల్ గా అభినవ్ గోమఠం నటించాడు. ఎన్ఐఏ ఏజంట్ వైష్ణవిగా ఐశ్వర్య మేనన్ నటించింది.
ఈ దర్యాప్తు సాగుతుండగానే 1940-45 మధ్య కాలంలోని సుభాష్ చంద్ర బోస్ ఫైల్ మిస్సవుతుంది. అసలు ఈ కథకూ, సుభాష్ చంద్రబోస్ ఫైల్ మిస్సింగ్ కూ ముడిపెట్టి కథను నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అబ్దుల్ ఖాదిర్ వెనుక మరో పెద్ద హస్తం ఉన్న విషయం దర్యాప్తులో తేలుతుంది. నూక్లియర్ ఫిజిక్స్ తో నిష్ణాతుడైన ఆ వ్యక్తి ఓ మిస్సైల్ తో భారత దేశానికి ప్రమాదం తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక కథ ఏమిటో అర్థమయ్యే ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ కూ ఈ కథకూ ముడిపెట్టడంలో దర్శకుడు తడబడ్డాడు. చివరికి కథ సుఖాంతం అవుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
దర్శకుడు గ్యారీ ఎడిటర్ గా అనుభవం ఉన్న వ్యక్తి. నిడివిని తగ్గించడంలో అతని ప్రతిభ కనిపిస్తుందిగానీ తను అనుకున్న కథను ప్రేక్షకులకు ఎక్కించడంలో విఫలమయ్యాడు. సుభాష్ చంద్రబోస్ ఫైల్ మిస్సింగ్ కూ, ఈ కథకూ లింక్ ఎక్కడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రానా పాత్ర ద్వారా ఏదో చెప్పించే ప్రయత్నం చేశాడుగానీ అది వర్కవుట్ కాలేదు. రానా పాత్రను కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయారు. మనకు స్వాతంత్ర్యం గాంధీ, నెహ్రూల వల్ల కాకుండా సుభాష్ చంద్ర బెస్ చేపట్టిన ఆపరేషన్ వల్లే వచ్చిందని రానా నోట డైలాగ్ తో చెప్పించారు. అది ఈ కథకు అప్రస్తుతం అని కూడా అనిపిస్తుంది.
మొదట్నుంచీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కథ అంటూ కలరింగ్ ఇచ్చారు కాబట్టి అదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని సినిమాని తెరకెక్కించి ఉంటే మరోలా ఉండేది. సుభాష్ మరణం వెనుక మిస్టరీని ఛేదించే జయ్ పాత్రతో ఓ కొత్త కథను తయారు చేసి ఉంటే బాగుండేది. లేదా ఈ కథను అర్థమయ్యేలా చెప్పగలిగితే కొంత ప్రయోజనం ఉండేది. జయ్ పాత్రకు నిఖిల్ న్యాయం చేశాడు. కానీ అతని నటన కూడా రొటీన్ లానే ఉంది. ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కనబరిచేలా అతను తనను తాను మౌల్డ్ చేసుకుని ఉంటే బాగుంటుంది. అభినవ్ గోమఠం పాత్రను కామెడీ కోసం పెట్టినట్టు ఉంటుంది.
ఐశ్వర్యా మేనన్ ఫరవాలేదనిపించింది. గ్లామర్ తక్కువ యాక్షన్ ఎక్కువలా ఈ పాత్ర ఉంది. సాన్యా ఠాకూర్ లుక్ బాగుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్యం సంగీతం బాగుంది. పాటలు మైనస్ అని చెప్పాలి. డైలాగుల్లో పసలేదు. కథనంలో తడబాటు ఈ సినిమాను దారి తప్పించింది. కథ శ్రీలంక, మయాన్మార్, జోర్దాన్, నేపాల్ ఇలా రకరకాల దేశాలు తిరుగుతుంది. చివరికి నిఖిల్ కజకిస్తాన్ బయలుదేరడంతో ఇంకేదో జరగబోతోందన్న భావన కల్పించారు. బహుశా సినిమా హిట్ అయితే దర్శకుడికి మరోసారి అవకాశం లభిస్తుంది.
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేశ్ పాండే, రానా దగ్గుబాటి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృధ్వీ తదితరులు.
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకాల
డీవోపీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
నిర్మాత: రాజశేఖర్ రెడ్డి
ఎడిటింగ్ – దర్శకత్వం: గ్యారీ బీహెచ్
విడుదల తేదీ: జూన్ 29, 2023
ఒక్క మాటలో: స్పై కాదు వై
రేటింగ్: 2.25/5