థియేటర్స్ పునః ప్రారంభం విషయంపై చర్చించడానికి హైద్రాబాద్ సుదర్శన్ థియేటర్ లో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ సమావేశమయ్యారు. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి, సుదర్శన్ థియేటర్ పార్టనర్ బాల గోవింద్ రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 15 నుంచి కేంద్రం అనుమతి ఇచ్చిందని, తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని అనుకుంటున్నామని, ఓనర్స్ అసోసియేషన్ అందరం థియేటర్స్ తెరవాలని నిర్ణయించామని, తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలని , ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని నమ్మకమని తెలిపారు.
అలాగే పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతించాలని కోరారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కూడా సినిమా హాళ్లు ఓపెన్ చెయ్యాలి అని చెప్పారని, వారికి కృతజ్ఞతలని చెప్పారు. బాల గోవింద్ రాజు మాట్లాడుతూ, థియేటర్స్ ఓనర్స్ ని కాపాడగలిగేది స్టేట్ గవర్నమెంటేనని , ఈ విషయంలో కొన్ని రాయితీలు ఇవ్వాలని, అలాగే పార్కింగ్ విషయంలో, కరెంట్ విషయంలోనూ ప్రభుత్వం సహకారమందిచాలని కోరారు.