నూతన పారిశ్రామిక విధానంపై ఏపీలో దళితులు చేసిన గట్టి పోరాటం ఫలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం దళితులను నిరుత్సాహ పరిచేలా ఉండింది. దీనిపై అప్పట్లో లియో న్యూస్ కథనం కూడా ప్రచురించింది. నూతన పారిశ్రామిక విధానం అంతా డొల్లే అని, రాయితీలకు మంగళం పాడారని తేలిపోయింది. గత ప్రభుత్వం దళితులకు 45 శాతం పెట్టుబడి రాయితీ ఇచ్చి వారిని ప్రోత్సహించింది. అంటే దళితులు ఏదైనా పెట్టుబడి పెట్టి పరిశ్రమ ప్రభుత్వం వారికి పెట్టుకుంటే దాదాపు సగం తిరిగి చెల్లించేది.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయితీలకు కోత వేసింది. పైగా మూడు సంవత్సరాలు పరిశ్రమ నడిపిన తర్వాత పరిశీలించి, తగ్గించిన రాయితీలు ఇస్తామని పాలసీలో ప్రకటించారు. దీనిపై దళిత పారిశ్రామికులు అప్పట్లోనే భగ్గుమన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ మంత్రులను ప్రజాప్రతినిధులను వారు నిలదీస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. ప్రభుత్వం దిగి వచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కొనసాగించేందుకు నిర్ణయించింది.
దళితులపై దాడులు యూపీలోనే కాదు ఏపీలోనూ….
ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. యూపీ తర్వాత ఏపీలోనే నేరాలు ఎక్కువయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దళితుల ఓట్లతో గెలిచి… వారిపైనే దాడులకు ప్రోత్సహిస్తారా? అంటూ దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల మంత్రులు పారిశ్రామిక విధానంపై కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో దళితులకు రాయితీలు కట్ చేయడంపై మంత్రులను పలువురు దళిత పారిశ్రామికులు నిలదీశారు.
ఈ కొత్త పాలసీ వల్ల తిరగలేకపోతున్నామని, ఎక్కడకు వెళ్లినా దళితులు నిలదీస్తున్నారని సదరు అమాత్యులు సీఎంఓకు సమాచారం ఇచ్చారట. అసలే దళితులపై దాడుల నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. దీనికితోడు పారిశ్రామిక రాయితీల కూడా తగ్గిస్తే వారు తిరగబడే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ పెద్దలు, రాయితీలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇచ్చేది ఉందా…ప్రకటనలకే పరిమితమా?
ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలు ప్రకటించినంత త్వరగా అందడం లేదు. రాయితీల కోసం 5 సంవత్సరాలు కూడా వేచి చూడాల్సి వస్తోంది. దీనికి తోడు కరోనా దెబ్బకు వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలు పెట్టే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కొత్తగా పరిశ్రమ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే రాయితీలు ఇస్తుందన్న నమ్మకం ఉండాలి. కానీ ఏపీలో ఆ నమ్మకం లేదు. అసలు రాయితీలు తమ ఖాతాలో పడే దాకా నమ్మే పరిస్థితి లేదని దళిత పారిశ్రామికులు వాపోతున్నారు.
దళితులు ఎదగరాదనే మంగళం పాడారా?
దళితులు ఆర్థికంగా ఎదగడం ఇష్టం లేకే వైసీపీ నాయకులు కొత్త పాలసీలో రాయితీలకు మంగళం పాడారని దళిత సంఘాల ఆరోపిస్తున్నాయి. తాము ఎదిగితే తమ మనుగడ కష్టమని వైసీపీ వారు భావిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నూతన పారిశ్రామిక పాలసీలో రాయితీలకు కోతలు వేశారని, ఇప్పుడు మళ్ళీ రాయితీలు కొనసాగిస్తామంటున్నా… ఇస్తారన్న నమ్మకం లేదని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమ పెట్టుకోవాలన్నా కనీసం భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. పాలసీ మార్చినంత ఈజీగా రాయితీలు వస్తాయనుకుంటే భ్రమే అవుతుందేమో…











