అక్రమంగా మద్యం రవాణా చేశాడంటూ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండగా…చనిపోయిన అజయ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీలో తమపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోవడంతో దళితులు, దళిత సంఘాల వారు ఆగ్రహంగా ఉన్నారు. ప్రతి వారం ఏపీలో ఏదో ఒక మూల దళితులపై దాడులకు సంబంధించి ఏదో ఒక కేసు వెలుగు చూస్తునే ఉంది.
తాజాగా విజయవాడకు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గోలో తరలించిన 2500 బాటిళ్ల మద్యం కార్టన్లపై అజయ్ అనే దళిత యువకుడి ఫోన్ నెంబరు ఉండటంతో ప్రత్యేక పోలీసులు అతణ్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీని వెనుక ఎవరున్నారనే విషయం బయటకు లాగేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో, అజయ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతణ్ని విచారించే సమయంలో ఫిట్స్ వచ్చాయని, వెంటనే ఆసుపత్రికి తరలించామని, డాక్టర్లు పరిశీలించి చనిపోయాడని చెప్పారన్నది పోలీసుల కథనం. డాక్టర్లు కార్డియక్ అరెస్టు అని మాత్రమే చెబుతున్నారు. జీజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ రిపోర్టు వస్తేనే అజయ్ మృతికి కారణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
దళితులపై అడుగడుగునా దాడులే…
దళితులపై పోలీసుల దాడులు చేయడం ఏపీలో ఇది మొదటి సారి కాదు. చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడు మాస్కు పెట్టుకోలేదని పోలీసులు చావబాదడంతో అతను చనిపోయాడు. ఇక పిఠాపురంలో దళిత యువకుడు ఇసుక దందాకు అడ్డువచ్చాడని పోలీసు స్టేషన్లోనే శిరోముండనం చేశారు. దళిత జడ్జి రామకృష్ణ, అతని తమ్ముడిపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి.
దళితుల ఓట్లతో గెలిచిన వైసీపీ దళితులపైనే దాడులు చేయిస్తోందని దళిత సంఘాలు ఆందోళనలతో భగ్గుమంటున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు జరగ్గానే వైసీపీ దళిత నేతలు రంగంలోకి దిగుతున్నారు. బాధితులకు భారీగా డబ్బు ముట్టజెప్పడం, కాంట్రాక్టు ఉద్యోగం ఆశ పెట్టడం వంటి ప్యాకేజీలతో వారి నోరు మూయించేస్తున్నారు. తాజాగా అజయ్ కేసులోనూ అదే జరిగిందని దళిత సంఘాలు అనుమానిస్తున్నాయి.
ఆమె కుమారుణ్ని వదిలేశారుగా….
దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగవరలక్ష్మి కారులో అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో ఆమెచే రాజీనామా చేయించారు. అయితే ఈ కేసులో పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి కుమారుడూ ఉన్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. దళిత యువకుడి విషయంలో అత్యుత్సాహం చూపిన పోలీసులు, దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి కుమారుడిని ఎందుకు వదిలేశారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దళితులపైనే పోలీసులు ప్రతాపం చూపుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
పెరుగుతున్న అసహనం…
ఏపీలో దళితులపై దాడులకు ఫుల్ స్టాప్ పడటం లేదు. దీంతో వైసీపీపై దళితుల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. వరుస దాడుల నేపథ్యంలో దళితులు తీవ్ర ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఘటన జరిగాక ప్రభుత్వం బాధితులకు అనధికారికంగా పరిహారం ఆశ చూపి నోరు మూయిస్తోందే కానీ దాడులు జరగకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు విమర్శిస్తున్నారు.










