ఒకప్పుడు మెహర్ రమేష్ డైరెక్షన్ అంటేనే అది మిషన్ ఇంపాజిబుల్ అని ముందుగానే డిసైడ్ అయిపోయేవారు టాలీవుడ్ జనం. స్టోరీ నెరేషన్ లో అద్భుతమైన టాలెంట్ చూపించే మెహర్ .. యన్టీఆర్ ను ఆ టెక్నిక్ తోనే రెండు సార్లు ఖంగు తినిపించాడు. ప్రభాస్ బిల్లా, వెంకీ షాడో సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన రిజల్ట్ రాబట్టాయి. స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన ఇతగాడికి.. బడ్జెట్ ను భారీ గా పెంచేసే అలవాటు కూడా ఉండడంతో అశ్వనీదత్ లాంటి నిర్మాతలు కొంతకాలం వరకూ కోలుకోలేకపోయారు.
ఆఫ్టర్ సెవన్ ఇయర్స్… మెగాస్టార్ పుణ్యమా అని మెహర్ రమేశ్ పేరు మళ్లీ టాలీవుడ్ లో వినిపిస్తోంది. పదేళ్ళ తర్వాత ఖైదీనెంబర్ 150 తో కమ్ బ్యాక్ అయిన చిరు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే.. పలువురు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. ఆయన రీ ఎంట్రీ తర్వాత తదుపరి సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతోనే వెళుతున్నారు అని అనుకొనే లోపే .. మెహర్ రమేశ్ తో కూడా ఆయన సినిమా చేయబోతున్నారు అని తెలియగానే అభిమానుల గుండెల్లో పెద్ద బాంబ్ పేలింది.
చిరుకు మెహర్ గురించి తెలిసే అవకాశం ఇస్తున్నారా? లేక అతడి గురించి ఆయనకి ఎవరూ చెప్పలేదా ? అనే సందేహాలు కూడా తలెత్తాయి. అంతేకాదు ఈ విషయంలో చిరంజీవిని ఆయన సన్నిహితులు వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేశారట. అయితే .. చాలా కాలంగా .. మెహర్ మెగా ఫ్యామిలీ తోనే ట్రావెల్ అవుతున్నాడు. అందులోనూ .. ‘వేదాళం’ తమిళ సినిమా రీమేక్ వెర్షన్ స్ర్కిప్ట్ ను మెగాస్టార్ కు సంతృప్తినిచ్చే వరకూ మార్పులు చేర్పులు చేసి.. ఆయన ఇమేజ్ కు తగ్గరీతిలో పెర్ఫెక్ట్ గా తీర్చిదిద్దాడట. అందుకే చిరంజీవి .. మెహర్ కు ఒక ఛాన్సిచ్చి చూద్దాం అనుకున్నారట.
అంతేకాదండోయ్.. బడ్జెట్ విషయంలో చిరంజీవి చాలా పక్కా గా వ్యవహరిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించినంత వరకూ ఒక్క పైసా కూడా అనవసరంగా ఖర్చుపెట్ట నీయకుండా.. అతడి జోరుకి కళ్ళెం వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎంతగా జాగ్రత్త పడినా.. అసలే బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు, అందులోనూ అతడికి మార్కెట్ లేదు. ఈ నేపథ్యంలో సినిమాకి హైప్ ఎలా క్రియేట్ అవుతుంది అనే సందేహం లేకపోలేదు. అయితే .. దానికి తగిన మార్కెట్ స్ట్రాటజీని చిరు ముందే రెడీ చేసి పెట్టుకున్నారట. మరి మెహర్ మిసైల్ నుంచి మెగాస్టార్ ఎలా తప్పించుకుంటారో చూడాలి.











